మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బిజినెస్ కరస్పాండెంట్ లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మహిళలు బ్యాంక్ నుండి పొందిన రుణాలు తిరిగి చెల్లింపు ప్రక్రియ లో బ్యాంక్ అధికారులు బిజినెస్ కరస్పాండెంట్ లకు అప్పిగించారు. ఇదే అదనుగా భావించిన వారు దొరికిన చోట దొరికినంత దండుకుంటున్నారు. గ్రూపు మహిళలు చెల్లించిన నగదును సరైన రసీదులు ఇవ్వకుండా సర్వర్ పని చేయడం లేదని నెపంతో తప్పించుకుంటున్నారు. అదే తరహాలో బ్యాంక్ సిబ్బంది వ్యవహరిస్తుండడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో మహిళలు ఉన్నారు. బిజినెస్ కరస్పాండెంట్ లను నిలదీయడానికి సరైన ఆధారాలు లేక పోవడంతో మిన్నకుండి పోతున్నారు. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం బిజినెస్ కరస్పాండెంట్ ల బాగోతం బయట పడింది.
డ్వాక్రా మహిళలు తమ నగదుకు సంబంధించి స్టేట్మెంట్ ప్రింట్ ఇవ్వాలని ముండ్లమూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వద్ద శనివారం మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన 150 మంది మహిళలు ధర్నాకు దిగారు.
శంకరాపురం గ్రామంలో 67 డ్వాక్రా మహిళా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపు నకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ముండ్లమూరు లోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జరుగుతున్నాయి. ఈ 67 గ్రూపు ల వారు వెలుగు కార్యాలయం ద్వారా బ్యాంకు రుణాలు పొంది ఉన్నారు. రుణాలు తిరిగి చెల్లిస్తూ మరియు పొదుపు నగదును తమ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ నగదు జమ చేసే సమయానికి బ్యాంకు దగ్గరకు వస్తే, బ్యాంకు అధికారులు బయట ఉన్న బ్యాంకు మిత్ర( బిజినెస్ కరస్పాండెంట్) లకు దగ్గరకు వెళ్లి శ్రీరామ్ సునీత కు ఇవ్వాలని తెలిపారు. ప్రతి నెల నగదును సునీతకు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ నగదును వారి ఖాతాలకు జమ చేయకుండా అవినీతికి పాల్పడుతుందని అనుమానం వచ్చిన శంకరాపురం గ్రామం మహిళలు సుమారు 150 మంది బ్యాంకుకు వచ్చి బ్యాంకు మేనేజర్ మోహన్ త్రివేదిని తమ ఖాతాలకు సంబంధించిన నగదు చెల్లింపుల స్టేట్మెంట్ లు కోరారు. వారు సర్వర్ సమస్య అని చెప్పినా .. ఇవ్వాలని వాగ్వి వాదానికి దిగడంతో కొన్ని గ్రూపులకు సంబంధించిన ఖాతాలను పరిశీలించగా సింగరకొండ గ్రూపు ఒక లక్ష 2000, కీర్తన గ్రూపు 70000, దుర్గా గ్రూపు 1,20,000, ఐజక్ గ్రూపు 20,000 నగదు జమ కాలేదని మేనేజర్ తెలిపారు. పూర్తి వివరాలతో మంగళవారం అన్ని గ్రూపులకు సంబంధించిన నగలు లావాదేవీల స్టేట్మెంట్ లు ఇస్తామని తెలిపారు. అయితే బ్యాంకు అధికారులు నగదు జమ, నగదు తిరిగి తీసుకోవడం లో ఇవ్వాల్సి ఉండగా బ్యాంకు పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఐదుగురు బ్యాంకు మిత్రుల ద్వారా ఆధార్ కార్డు ద్వారా నగదు చెల్లింపు, నగదు తీసుకోవడం చేస్తున్నారు. బ్యాంకు పాస్ పుస్తకం పై ప్రింట్ ఇవ్వాలని అడగగా సర్వర్ పని చేయడం లేదని చెప్పడంతో నిరక్షరాసులైన మహిళలు మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తిస్తూ మాపై దాడులు చేస్తున్నారని వారు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి బ్యాంక్ అధికారులు ముండ్లమూరు బ్యాంకు లావాదేవీల పై తనిఖీలు నిర్వహించి తని మహిళలకు న్యాయం చేయాలని బ్యాంకు ఖాతాదారులు అంటున్నారు.

