సూపర్ జీఎస్టీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు విమర్శించారు. సిపిఎం దొనకొండ శాఖ సమావేశం సోమవారం కుందుర్తి చిన్న నరసింహులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గత నెల 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ.2 పేరుతో ప్రజలకు పన్నుల భారం నుంచి పెద్ద ఉపశమనం కల్పిస్తున్నట్లు, రోజు పండగ చేసుకోండి అని సూపర్ జీఎస్టీ ఆర్భాటాన్ని ప్రారంభించిందని అన్నారు. స్వయాన ప్రధానమంత్రి మన రాష్ట్రంలోని కర్నూలు నగరానికి విచ్చేసి సభ పెట్టి ప్రచారం చేశారని అన్నారు. ఇంతకీ ప్రజలు నిత్యం వాడుకునే ఏ వస్తువులు మీద ఎంత ధర తగ్గించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.ఇది సూపర్ మోసం గా ఉందని అన్నారు. సూపర్ జీఎస్టీ ద్వారా ఒక్కో కుటుంబానికి 15 వేల రూపాయలు చొప్పున ఆదా అవుతుందని చెబుతున్న ప్రభుత్వం గడచిన ఎనిమిది సంవత్సరాలుగా ఆ మోతాదులో ప్రజల మీద భారాలు మోపిన మాట ఒప్పుకోవడమేనని అన్నారు. ఈ భారాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని, దీంతో పాటు బీహార్ రాష్ట్రంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జీఎస్టీ లో కొన్ని మార్పులు చేసి పండగ చేసుకోండి, పండగ చేసుకోండి అని ప్రజలను మభ్యపుచ్చుతున్నారని అన్నారు. విద్యార్థులు వాడుకునే నోటు పుస్తకాల మీద జీఎస్టీ తొలగించామని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో నోటు పుస్తకాలు ధరలు పెరిగాయని అన్నారు. పుస్తకాలకు వాడే పేపర్ మీద 12 నుండి 18 శాతానికి జీఎస్టీ పెరిగినందున ఇది భారంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల మీద వేస్తున్న భారాలను తగ్గించి, సంపద పన్ను వారసత్వ పన్ను, కార్పొరేట్ల మీద వేస్తున్న పన్నును పెంచాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ని జిఎస్టి పరిధిలోకి తెచ్చి ప్రజల మీద భారాలు తగ్గించాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడకపోగా పాలకులకు ప్రచార కార్యక్రమంగా మారిన సూపర్ జీఎస్టీని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆహా ఓహో అంటూ కేంద్రానికి భజన చేయటం విచారకరమని అన్నారు.
సిపిఎం మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నాడు ఇచ్చిన వాగ్దానాలలో 50 ఏళ్లకే పెన్షన్, మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న ఆడబిడ్డ పథకం, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులందరికీ భృతి లాంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయకపోగా రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను కార్పోరేట్లకు కట్టబెడుతూ, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించవలసిన ఆసుపత్రులను ప్రవేట్ పరం చేయటం అమానుషమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన తప్పదని అన్నారు.
ఈ సమావేశంలో కర్ణా కృష్ణ, కోలా కిరణ్, కురవాడి రామయ్య, మేళం ఉదయ్, ఎర్రగుంట్ల నతాన్ పాల్గొన్నారు.
