రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్ – ఈ ఏడాది జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు-దశాబ్దాల కల సాకారం.. రూ.50 కోట్లతో కలక్టరేట్-జిల్లా ఏర్పడ్డాక తొలిసారి వెళ్లిన ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం-గత పాలకులు ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమిచ్చేశారు-వెలిగొండపై వైసీపీ డ్రామాలను ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు-రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు సీఎం శంకుస్థాపన-మార్కాపురం జిల్లా కళ, వెలిగొండ కళకళ బహిరంగ సభా వేదికలో సీఎం

ఈ ఏడాది జూలై నాటికి వెలిగొండ తొలిదశ పూర్తిచేసి మార్కాపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుడిలా ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రిబ్బన్ కటింగ్లు చేసి దొంగ నాటకాలు ఆడటం తమకు చేతకాదని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబాటుకు గురైన మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ ఎకరాకూ నీరివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం విశ్రాంత ఇంజనీర్లతో ఓ బృందాన్ని వేసి అధ్యయనం చేయిస్తామని తెలిపారు. ప్రతీ ఎకరాకూ సాగునీరు ఇచ్చే అంశంపై బ్లూ ప్రింట్ తయారు చేస్తామని అన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవాని పల్లెలో రూ.456 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రైతులతో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ…‘గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేటు ఇచ్చారు. అరకు మొదలుకొని ప్రకాశం వరకూ మంచి విజయం అందించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం, మదనపల్లి, పోలవరం ప్రాంతాలను జిల్లాలు చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నిలబెట్టుకున్నాను. ఇక్కడి ప్రజలు 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు కు వెళ్లాల్సిన పని లేకుండా మార్కాపురాన్ని జిల్లా చేశాను. అన్యాయం జరిగిన మదనపల్లికి న్యాయం చేశా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*శంకుస్థాపనతో పాటు ప్రారంభించే అవకాశం నాకే వచ్చింది*

1996,మార్చి 5న ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూశాను. శ్రీశైలం నుంచి నీరివ్వమని ఇక్కడి ప్రజలు నన్ను కోరారు. ఆనాడు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి మీ జీవితాల్లో వెలుగులు తెస్తాను. రైతులను ఆదుకుంటాం. 2014-2019లో ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాం. ఈ ప్రాజెక్టు ద్వారా 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం. దీని వల్ల గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలకే కాకుండా ఉదయగిరి, కడప జిల్లా బద్వేలుకు కూడా నీరు అందుతుంది. 2019లో మనమే అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీరిచ్చేవాళ్లం. 2019-2024 మధ్య చీకటి రోజులు వచ్చాయి. గత  ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ దొంగ నాటకాలు ఆడాడు. చీమకుర్తి, మార్కాపురం సభల్లో 2023లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఉత్తుత్తి ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ చేశాడు. ఇలా చేయడం మోసం కాదా. నేను చేయగలిగిందే చెబుతున్నాను. వెలిగొండ ప్రాజెక్టుకు పూర్తికి రూ.9081 కోట్ల నిధులు కావాలి. ఇప్పటి వరకూ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5451 కోట్లు ఖర్చు వ్యయం చేశాం. భూసేకరణకు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు ఖర్చు చేశాం. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక చేశాం. ఇంకా రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావు. గడచిన 20 నెలల్లో రూ.540 కోట్లు ఖర్చు చేసి పనులు వేగంగా చేపట్టాం. రూ.456  కోట్లతో విలువైన ఫీడర్ కెనాల్ లైనింగ్  పనులకు శంకుస్థాపన చేశాను. గత పాలకులు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు అయిపోయాయని రైతులకు పంగ నామాలు పెట్టారు. మంచి చేసిన వారికి అండగా నిలుస్తేనే ప్రజల జీవితాలు మెరుగు అవుతాయని ముఖ్యమంత్రి అన్నారు.

*రూ.1300 కోట్లతో ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు*

అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఎక్కడ పేదలు ఉంటే అక్కడ నేను ఉంటాను. ఎన్నికల్లో చెప్పినట్టే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. పింఛన్ల కోసం ప్రతి ఏటా రూ.34 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు రావాలని డ్వాక్రా సంఘాలు స్థాపించాను. ఈ ఏడాది లక్షమంది ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు మూడు విడతల్లో రూ. 20,000 ఇస్తున్నాం. 2027లో పుష్కరాలకు ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం.  నల్లమల సాగర్ కు గోదావరి నీళ్లు ఇస్తాం. అది వచ్చేలోగా ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టు కోసం ఇంకా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.  గతేడాది హంద్రినీవాపై శ్రద్ధ పెట్టాం. ఈ ఏడాది వెలిగొండ పై శ్రద్ధ పెట్టి ప్రజల జీవితాల్లో జలకళ తీసుకొస్తాం. హార్టికల్చర్ కు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నాం. సీమతో పాటు మార్కాపురం, ప్రకాశం జిల్లాలను ఉద్యాన పంటలతో అభివృద్ధి చేస్తాం. మార్కాపురాన్ని ఉద్యాన పంటలకు కేంద్రంగా తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలి.  రూ.1300 కోట్లు వ్యయంతో నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

*రూ.50 కోట్లతో జిల్లా కలెక్టరేట్ నిర్మిస్తాం*

ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే మార్కాపురాన్ని జిల్లాగా చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాం. మార్కాపురం జిల్లాలో భూ రికార్డుల సమస్యలున్నాయి. మేము అధికారంలోకి వస్తూనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. గత పాలనలో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. అడిగిన భూములు ఇవ్వకపోతే 22ఏలో పెట్టారు. సర్వే రాళ్లపై వారి ఫోటోలు వేసుకున్నారు. మేము రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ తో భూమి రికార్డులు భద్రంగా తయారు చేయిస్తున్నాం. ఎవరైనా తప్పు రికార్డులు చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నాను. మార్కాపురం జిల్లా నూతన కలెక్టరేట్ భవనానికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. 20 నెలల పాలనలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అవినీతికి తావు లేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాం. కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి చేశాం. వరద నీరు వృథాగా పోకుండా భూగర్భ జలాలు పెంచుతాం. గోదావరి నుంచి 6000 టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లింది. వెలిగొండ ప్రాజెక్టుకు కావాల్సింది కేవలం 53 టీఎంసీల నీరే. ఈ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో సురక్షిత నీరు సరఫరా చేస్తాం.  పరిశుభ్రమైన రాష్ట్రం కోసం ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నాం. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పీ4 కార్యక్రమం చేపట్టాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

*2019-24 మధ్య రాష్ట్రానికి చీకటి రోజులు*

గత పాలకులు చేయని అపచారం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కెమికల్స్ కలిపిన నెయ్యితో లడ్డూలు చేసి విక్రయించారు. ఆ నెపాన్ని హెరిటేజ్ పై మోపారు. ఆనాడు బాబాయ్ ని చంపేసి మరుసటి రోజు సాక్షి పత్రికలో నారా సుర రక్త చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టాడు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు. నా తల్లి, భార్య, మా పార్టీ నేతలను ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రారు కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటారు. వాళ్లు బెదిరిస్తే ఇవ్వాలా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఏదైనా సాధ్యం అని కూడా వారికి తెలీదా? గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంస జరిగింది. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడ్డారు. గంజాయి, భూ కబ్జాలు, దౌర్జన్యాలతో హడలిపోయారు. నేను ఎవరు తిట్టినా లెక్కపెట్టుకోను. నేను జీవిస్తోంది ప్రజలు, రాష్ట్రం కోసమే. నాకు కుల, మత విభేదాలు లేవు. తెలుగు జాతి అభ్యున్నతి నాకు ముఖ్యం. బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చి అవకాశాలు కల్పిస్తాం. నేను ఆనాడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. మన దూరదృష్టి కారణంగా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ నుంచి వస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో 25 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది. మోదీ 3వ సారి ప్రధాని అయ్యారు. మరోసారి అవుతారు.  ప్రజలు ఏది మంచి, ఏది చెడు అనేది ఆలోచన చేసి…కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు.

*స్థానిక రైతులతో కలిసి ఫీడర్ కాలువ పనులు పరిశీలన*

వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన అనంతరం రైతులు వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండి వీరారెడ్డిలతో సంభాషిస్తూ ఫీడర్ కెనాల్ పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. వెలిగొండ పూర్తి అయితే ఈ ప్రాంత భూగర్భజలాలు కూడా పెరుగుతాయని, బోర్లకు, చెరువులకు నీరు వస్తాయని ముఖ్యమంత్రికి రైతులు వివరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు, ఫీడర్ కాలువ పనులు వేగంగా చేపడుతున్నందుకు ముఖ్యమంత్రికి స్థానిక రైతులు ధన్యవాదాలు తెలిపారు. అరటి, బొప్పాయి లాంటి పంటల సాగు చేసేందుకు అనుకూల ప్రాంతమని, మీరే శంకుస్థాపన చేశారు, మీరే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నారని సీఎంతో రైతులు అన్నారు. ప్రాజెక్టులో రూ.2500 కోట్ల విలువైన పనులు మిగిలి ఉన్నా వాటిని పూర్తి చేయకుండా జాతికి అంకింతం చేసినట్టు గత పాలకులు నాటకాలాడారని ముఖ్యమంత్రి అన్నారు.

*వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష*

ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. 11,580 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా ఫీడర్ కాలువ పనులు చేపట్టామని జల వనరుల శాఖ అధికారులు వివరించారు. నల్లమల సాగర్ ప్రాంతంలో మూడు గ్యాప్స్ ఫిల్ చేసి రిజర్వాయర్ ఏర్పడిందని , తద్వారా 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రోజుకు 200 మీటర్ల మేర కాలువ లైనింగ్ పనులు చేస్తున్నామని , 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర సైడ్ వాల్ పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఫ్లడ్ సీజన్ ప్రారంభం అయ్యే సమయానికి ఫీడర్ కాలువ సిద్ధం అయిపోతుందని వెల్లడించారు. 45 రోజుల్లో 45 టీఎంసీల మేర నీరు డ్రా చేసుకుని నల్లమల సాగర్ నింపేందుకు ప్రణాళిక చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలు, కాలువ పనులు తదితర  అంశాలను నమూనా ద్వారా వివరించారు. కంబం చెరువును కూడా నింపేలా కాలువను అనుసంధానించినట్టు తెలిపారు. స్థానికంగా వివిధ చెరువులు, నీటి వనరుల్ని నింపేందుకు అవసరమైన స్ట్రక్చర్లను పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రూ. 400 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.  వెలిగొండ టన్నెళ్ల పనులు పూర్తి అయ్యాక, పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

*మార్కాపురంలో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం*

నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారి మార్కాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. జిల్లా ఏర్పాటు కలను నిజం చేసినందుకు ముఖ్యమంత్రికి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం జిల్లా కళ, వెలిగొండ జలకళ సభకు హాజరైన ముఖ్యమంత్రికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.  వేదిక నుంచి ప్రజల మధ్యకు వేసిన ర్యాంపు పై నడుస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు హర్షాతిరేకాల మధ్య ఆయన ప్రసంగం యావత్తూ ఉత్సాహంగా సాగింది. సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు.

రాయలసీమ రత్నాలసీమగా మార్చేందుకు హార్డ్ కల్చర్ క్లబ్ – ఎంపీ మాగుంట

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మార్కాపురం జిల్లా పర్యటనలో మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా వెనుకబడ్డ ప్రాంతంలో సిపిజి ప్లాంట్ ఏర్పాటుతో పాటు వరల్డ్ బ్యాంక్ నిధులతో రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా మార్చేందుకు 40 వేల కోట్ల రూపాయలతో హార్డీ కల్చర్ హబ్ రాబోతుందని అందులో మార్కాపురం జిల్లా చేరబోతుందని, హార్టీ కల్చర్ హబ్ ద్వారా రహదారుల అభివృద్ధితోపాటు కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ కు వచ్చినప్పుడల్లా కేంద్ర మంత్రులు కలుస్తూ పదేపదే వారితో 60 వేల కోట్ల రూపాయలతో పోలవరాన్ని సాగర్ తో అనుసంధానం చేస్తామని దీనికి అనుమతులు ఇవ్వాలని కోరడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు, గత ప్రభుత్వంలో మూతబడిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ముఖ్యమంత్రి కృషితోనే దాన్ని తిరిగి ప్రారంభించేలా చేయడం జరిగిందని, దీనికి ప్రధానమంత్రి బడ్జెట్లో 60 వేల కోట్లు కేటాయించి రాష్ట్రానికి 26 వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందన్నారు, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను ముఖ్యమంత్రి కృషితో కనిగిరి వరకు రైలు వస్తుందన్నారు, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారని ప్రకాశం దీటుగా జిల్లా కేంద్రంలో అన్ని వసతులు సమకూర్చేందుకు 50 కోట్ల రూపాయలు మార్కాపురం జిల్లాకు కేటాయించాలని ముఖ్యమంత్రి ని కోరారు. ఈ నిధులతో జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే గత 40 సంవత్సరాలుగా మాగుంట కుటుంబాన్ని ఆదరించినట్లుగానే రానున్న రోజుల్లో మాగుంట కుటుంబాన్ని అదేవిధంగా ఆదరించాలని విన్నవించారు.

పూర్తికాని వెలుగొండను.. జాతికి అంకితమంటూ జగన్ మోసగించారు
-గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి ఇసుక దోపిడీ చేశారు- ఐదేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ జ‌గ‌న్ రెడ్డి భ్ర‌ష్టు ప‌ట్టించాడు- కూట‌మి ప్ర‌భుత్వంలో ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నాం
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసగించారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. పనులు పూర్తిచేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. రైతుల ఆశలను వమ్ము చేస్తూ ప్రాజెక్టును రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ధ్వంసం చేసి, భారీ ఎత్తున ఇసుక దోపిడీ చేశారని అన్నారు. ప్రజా సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం దానినే దోచుకుందన్నది దురదృష్టకరమన్నారు. ఇలా జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలో  బుధ‌వారం  సీఎం చంద్ర‌బాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌జా వేదిక బహిరంగ స‌భ‌లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… కూట‌మి ఏర్ప‌డిన వెంట‌నే గుండ్ల‌క‌మ్మ‌కు కొత్త గేట్ల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం 20 ల‌క్ష‌ల చేప పిల్ల‌ల‌ను గుండ్ల‌క‌మ్మ‌లో వ‌దిలిన విష‌యాన్ని మంత్రి స‌భా ముఖంగా గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాజ‌ధాని అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగ‌వంతం చేసినట్లు స్పష్టం చేశారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన వెంట‌నే ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. గ‌డిచిన 19 నెల‌ల కాలంలోనే ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కింద పేద‌ల‌కు వెయ్యి కోట్లు రూపాయిలు స‌హాయం చేశామ‌ని తెలిపారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పేద‌ల పెన్ష‌న్ వెయ్యి రూపాయిలు పెంచ‌డానికే ఐదేళ్లు ప‌ట్టింద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. కూట‌మి ప్ర‌భుత్వంలో అన్ని హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. కేవ‌లం ఒక్క సంత‌కంతోనే  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేద‌ల పెన్ష‌న్ ను వెయ్యి రూపాయిలు పెంచార‌ని చెప్పారు. ఆర్థిక అస‌మాన‌త‌లు తొల‌గించ‌డానికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పీ4 కార్యక్ర‌మాన్ని రూపొందించార‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు.

*విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం*

2019 వ‌ర‌కు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్., వైసీపీ పాల‌న ఐదేళ్ల‌లో స‌ర్వ నాశనం అయ్యింద‌ని మంత్రి గొట్టిపాటి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అడ్డ‌గోలు విద్యుత్ కొనుగోళ్లు, అనాలోచిత నిర్ణ‌యాల‌తో విద్యుత్ వ్య‌వ‌స్థ‌కు రూ.1.29 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని వెల్ల‌డించారు. పాద‌యాత్ర‌లో ఇచ్చిన దొంగ హామీల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేసి జ‌గ‌న్ అధికారం చేప‌ట్టార‌ని మంత్రి గొట్టిపాటి విమ‌ర్శించారు. ఒక్కాసారి ఓటంటూ అధికారం చేప‌ట్టిన వైసీపీ., రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లింద‌ని ఆరోపించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్ర‌జ‌ల‌పై సుమారు రూ.30 వేల కోట్లు విద్యుత్ భారాన్ని మోపార‌న్నారు. కూట‌మి అధికారం చేప‌ట్టిన 15 నెల‌ల కాలంలోనే 13 పైస‌లు ట్రూ డౌన్ చేయ‌డ‌మే కాకుండా., గ‌డిచిన 19 నెల‌ల్లో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీ పెంచ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

*ఆల‌యం అప‌విత్రం…. ల‌డ్డూ క‌ల్తీ….*

దేశంలోని హిందువులంద‌రూ అతి ప‌విత్రంగా భావించే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప‌విత్రం చేశార‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కోట్లాది భ‌క్తుల‌కు ఎంతో ప్రీతి పాత్ర‌మ‌యిన తిరుప‌తి ల‌డ్డూని కూడా క‌ల్తీ చేశార‌ని తెలిపారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ గాడిలో పెడుతున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. చివరగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మార్కాపురం ప్ర‌త్యేక‌ జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించారని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు.

వెలుగొండ పూర్తికాకుండానే జాతికి అంకితం చేసి జగన్ జిల్లా ప్రజలను మోసం చేశారు – వైసీపీవన్నీ ఫేక్ మాటలు, ఫేక్ రాజకీయాలే
– ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు – త్వరలోనే వెలుగొండ పూర్తిచేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
– మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి

ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు,త్వరలోనే వెలుగొండను పూర్తిచేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే ఎన్నికల ముందు జాతికి అంకితం చేసి జగన్ జిల్లా ప్రజలను మోశారు. నాడు వెలిగొండ పూర్తయిందంటూ వైసీపీ నీలి మీడియాలో నానా హంగామా చేశారు, నేడు వైసీపీ నేతలు వెలుగొండకు నిధులు కేటాయించాలని మాట్లాడుతున్నారు. ఇంతకంటే మోసం ఇంకొకటి లేదు, ప్రజలు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ కూడా లేకుండా వైసీపీ నేతలు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. వైసీపీవన్నీ ఫేక్ మాటలు, ఫేక్ రాజకీయాలే. ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం, పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతాం. గత 5 ఏళ్లు జగన్ చేసిన మోసాలకే 11 సీట్లకు పరిమితమయ్యారు. జగన్ మాదిరి మేం ప్రజలను మోసం చేయం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ద్వేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన నాయకులు , అధికారులు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 1-32 గంటలకు హెలికాప్టర్ లో దోర్నాల మండలం, గంటవానిపల్లికి చేరుకాగానే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు, కనిగిరి శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు, ప్రకాశం జిల్లా జాయింట్ కల్పనా కుమారి, మార్కాపురం జాయింట్ కలెక్టర్ పోలీస్ శ్రీనివాసరావు ,కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశి, యర్రగొండపాలెం, దర్శి నియోజక వర్గ టిడిపి ఇంఛార్జి లు ఎరిక్షన్ బాబు, డా గొట్టిపాటి లక్ష్మి, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *