ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.మార్కులు జీవితాన్ని శాసించలేవు.హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జనర్.

హైదరాబాద్, ఏప్రిల్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
పదవ తరగతి ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జనర్ కీలక విన్నపం చేశారు. ఈ ఫలితాలు విద్యార్థుల జీవిత గమనాన్ని శాసించేవి కావని, సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, మార్కులు తక్కువ వచ్చాయని ,విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, అది ఆయా కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుందని హితవు పలికారు.ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య కేసుల‌ను మహిళా భద్రత విభాగం అధికారులు స‌మ‌గ్రంగా దర్యాప్తు చేసి, బాధిత తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయ‌ని తెలిపారు. ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఫలితం ఏదైనా సరే, పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సూచించారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఫలితాల వెల్లడి తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించాలని, వారు ఒంటరిగా ఉన్నా లేదా మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పాలని కోరారు. అవసరమైతే పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది కేవలం తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని వారికి భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు.చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దని ఉద్ఘాటించారు. పరీక్షల కంటే ప్రాణం గొప్పదని, ప్రతి విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఉందని, వారి కోసం తల్లిదండ్రులు తపిస్తున్నారనిఆలోచించాలని సూచించారు. ఏ చిన్న ఆందోళన కలిగినా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో మనసు విప్పి పంచుకోవాలని, ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని
సి పి సజ్జనర్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *