సికింద్రాబాద్ మే 16,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎలాంటి అర్హతలు లేకున్నా చేతిలో సిరంజి పట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అక్రమంగా వైద్యం చేస్తున్న
ఒక నకిలీ డాక్టర్ గుట్టును వారాసిగూడ పోలీసులు రట్టు చేశారు. వారాసిగూడ పరిధిలోని ‘మాధవ మెడికల్ షాప్’ వేదికగా సాగుతున్న ఈ అక్రమ ధందాను పోలీసులు చాకచక్యంగా చేదించి, నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన నన్నుట మాధవ్ (42) అనే వ్యక్తి వారాసిగూడలో నివసిస్తున్నాడు.ఇంటర్మీడియట్ కూడా పాస్ కాని ఇతనికి ఎలాంటి వైద్య లేదా ఫార్మసీ అర్హతలు లేవు. అయితే, సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో, కుంట అర్చన అనే
స్నేహితురాలికి చెందిన డ్రగ్ లైసెన్స్‌ను ఆసరాగా చేసుకుని క్లినిక్ బోర్డు తిప్పేశాడు. గత ఏడాది కాలంగా తానే పెద్ద డాక్టర్ లాగా చలామణీ అవుతూ, రోగులకు ఇష్టమొచ్చినట్లు వైద్యం చేస్తున్నాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా విచ్చలవిడిగా డిక్లోఫెనాక్ (Diclofenac), టిటి (TT) వంటి ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాడు.
దీనిపై ఖచ్చితమైన సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా స్కెచ్‌తో ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ముఫ్తీలో (సాధారణ దుస్తుల్లో) వెళ్లిన ఒక హెడ్ కానిస్టేబుల్‌కు నిందితుడు మాధవ్ ఇంజక్షన్ ఇవ్వబోతుండగా, పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో, సబ్-ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆ షాప్ నుండి అక్రమంగా నిల్వ ఉంచిన డిక్లోఫెనాక్, టిటి ఇంజక్షన్ వైల్స్‌తో పాటు వ్యాపారానికి వాడుతున్న శామ్సంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
పోలీసుల హెచ్చరిక.
ఎలాంటి అర్హత లేకుండా నకిలీ వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారాసిగూడ పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా తమ ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, కేవలం గుర్తింపు పొందిన, అర్హత కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల వద్ద మాత్రమే చికిత్స చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
