పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యంతో పాటు గౌరవం కూడా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి సంతమాగులూరు మండలం సజ్జాపురంలో ‘ పల్లె నిద్ర’లో పాల్గొని స్వర్ణ గ్రామ సచివాలయంలో బస చేశారు. శనివారం ఉదయం అదే గ్రామంలో నిర్వహించిన ‘ స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంద్ర ‘ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పారిశుధ్య పనుల్లో ఆయన భాగస్వామి అయ్యారు. అనంతరం చర్చి సెంటర్లో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ… ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ‘ స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ‘ కార్యక్రమాన్ని 17 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలలో ‘ ప్లాస్టిక్ రహిత రాష్ట్రం ‘ అనే ఇతివృత్తంతో తలపెట్టినట్లు వివరించారు. ప్లాస్టిక్ ను, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించవద్దని సూచించారు. పాత ప్లాస్టిక్, ఇనుము డబ్బాలను తీసుకుని, ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ఇచ్చేందుకు ‘ స్వచ్ఛరథం ‘ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనిని వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
గ్రామంలో విస్తృత పర్యటన
పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన క్షేత్రస్థాయి సమస్యలను పరిశీలించేందుకు శనివారం వేకువజామునే సబ్జాపురంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. రక్షితనీటి పథకాన్ని పరిశీలించి, నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నీటిలోని ఖనిజాల విశిష్టతను ప్రజలకు వివరించి, ప్రభుత్వం సరఫరా చేస్తున్న కుళాయి నీటినే తాగాలని ప్రజలకు సూచించారు. స్వయంగా కలెక్టరే నీటిని తాగి ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే స్థానిక స్మశానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, పక్కనే ఉన్న వాగు వలన ముంపునకు గురికాకుండా మట్టితో లెవలింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా తడి చెత్త – పొడి చెత్తను ఇళ్ల వద్దే
వేరుచేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని ప్రజలకు తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి, ఈ స్థలం చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మించడంతో పాటు విస్తృతంగా వినియోగంలోకి తేవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కొండ దిగువ ప్రాంతంలో తాము పశువులను మేపుకుంటున్నామని, ఈ విషయంలో తమకు సహాయం చేయాలని స్థానికులు కోరగా… ఆ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆ మేరకు కాపరులు తమ పశువులను మేపుకునేందుకు అనుమతించాలని అధికారులకు చెప్పారు. ఎస్సీ కాలనీలో సిమెంటు లింకు రోడ్లు కావాలని, స్థానిక ప్రాథమిక పాఠశాల గోడలకు గ్రిల్స్ ఏర్పాటు చేయించాలని ప్రజలు కోరగా… ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలోకలెక్టర్ వెంట ఆర్డీఓ జాన్సన్, జడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు, డి.ఎం.హెచ్.వో. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





