యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత లభిస్తాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా చేస్తున్న యోగా సాధనలో భాగంగా సోమవారం ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకోసం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ స్వయంగా నడుచుకుంటూ వచ్చారు. యోగాసనాలు వేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్లో స్ఫూర్తిని నింపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందులో భాగంగా ప్రజలందరూ యోగా సాధన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలోనూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 15 రోజులపాటు ఇలాంటి సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా భారతదేశంలో పుట్టి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కళ అని చెప్పారు. ఆరోగ్యకరంగా, సాత్వికంగా ఉండేందుకు యోగా చక్కని మార్గమని అన్నారు. దీనిని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ మాధురి, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, మెప్మా పీడి విజయలక్ష్మి, ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు భ్రమరాంబ, భీమ్ నాథ్, డి.ఎస్.డి.వో. రాజరాజేశ్వరి, ఇతర అధికారులు, పతంజలి యోగ సంస్థ గురువులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా, 45 నిమిషాల పాటు చేసే కామన్ యోగా ప్రోటోకాలును తెలిపే పోస్టరును ‘ మీకోసం ‘ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, ఇతర అధికారులు ఆవిష్కరించారు.



