దొనకొండలో పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను రెండు వారాలలోగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ రాజాబాబు

దొనకొండలో పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను రెండు వారాలలోగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అద్దంకి ఆర్డిఓ విజయజ్యోతి కుమారిలతో కలిసి దొనకొండ మెగా పారిశ్రామిక హబ్ లోని వివిధ బ్లాకులను సందర్శించారు. ఈ హబ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు, అవసరతలు, స్థానిక పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయా అంశాలపై తహసిల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


దొనకొండ ప్రాంతాన్ని 25వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే బీడీఎల్, ఏపీజిఈసి, భవ్య ఇండస్ట్రీ సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయన్నారు. బీడీఎల్ సంస్థ కోరిన స్థలం సమీపంలోనే హెయిర్ స్ట్రిప్ ఉండడంతో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ఈ 25 వేల ఎకరాలతో కూడిన హబ్ లో భూసేకరణ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ, పట్టా, అసైన్డ్, పోరంబోకు తదితర రకాల భూముల సర్వేను కూడా రెండు వారాల్లోగా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు.

             నీటి ఇబ్బందులు తొలగించాము

       దొనకొండ మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసినవారికి బిల్లులను పూర్తిస్థాయిలో చెల్లించామన్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు రప్పించి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
            ఈ సందర్భంగా వారి వెంట ఎంపీడీవో వసంతరావు నాయక్, తహసిల్దార్ రమాదేవి, ఇతర అధికారులు ఉన్నారు. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *