సికింద్రాబాద్ జూన్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్‌లోని చుట్టలబస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టలబస్తీ యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫణి, డాక్టర్ వై. లత తదితర వైద్యాధికారులు పోలియో బూత్‌లను సందర్శించి, స్థానిక చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించి, వారిని ఆరోగ్యంగా ఉంచాలని ఈ సందర్భంగా వైద్యులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
తమ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 5,066 మంది ఐదేళ్లలోపు వయసు కలిగిన పిల్లలు ఉండగా, ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 95 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ ఫణి వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 31 బూత్‌లలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బందితో పాటు నర్సింగ్ విద్యార్థులు పాల్గొని సేవలు అందించారని తెలిపారు. మొదటిరోజు పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన మిగిలిన చిన్నారుల కోసం సోమవారం వైద్య సిబ్బంది నేరుగా ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని ఆమె స్పష్టం చేశారు. దేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్యాధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
