హైడ్రా ముసుగులో పేదల ఇళ్లు కూల్చితే ఖబర్దార్‌……లేఅవుట్‌ దొంగలపై దమ్ముంటే చర్యలు తీసుకోండి.ఎంపీ ఈటల రాజేందర్

బోయినపల్లి జూన్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయినపల్లి డివిజన్ అస్మత్‌పేటగ్రామంలోని సర్వేనెంబర్ 1 భూమి చుట్టూ జరుగుతున్న పరిణామాలు నిరుపేదల గుండెల్లో ఆందోళన నింపుతున్నాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. దశాబ్దాలుగా హమాలీలు, ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే నిరుపేదలు తమ రక్తాన్ని చెమటగా మార్చి, తక్కువ ధరకు వస్తుందని నమ్మి ఇక్కడ 50 నుంచి 60 గజాల స్థలాలు కొనుక్కుని తలదాచుకుంటున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ భూమిని ఆర్కియాలజీ స్థలమనో, ప్రైవేటు భూమనో సాకులు వెతుకుతూ పేదల ఇళ్లను కూల్చేందుకు యత్నించడం దుర్మార్గం అన్నారు. ఆనాడు కళ్ల ముందే దొంగతనంగా లేఅవుట్లు చేస్తున్నప్పుడు ఈ నిబంధనలు అధికారులకు గుర్తుకు రాలేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా దమ్ము, నిజాయితీ ఉంటే ఆనాడు అక్రమంగా లే అవుట్లు చేసిన కేటుగాళ్లపై, దానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి తప్ప కష్టపడి కట్టుకున్న నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బ్రోకర్ల చేతిలో, పెద్ద పెద్ద కబ్జాదారుల చేతిలో ఉన్న వందల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని, అందులో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలి తప్ప, ఈ రకంగా నిరుపేదలను రోడ్డున పడేసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రులు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే హైదరాబాద్‌లో ఇన్ని బస్తీలు వెలిసేవి కావని, పేదవాడికి గజం జాగా కూడా దక్కేది కాదని హితవు పలికారు. మరోవైపు శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ,కబ్జాదారులను, గూండాలను నియంత్రించాల్సింది పోయి పేదల ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులకు అండగా నిలవడం శోచనీయమని, ఇది పోలీసు వ్యవస్థకే ఒక మచ్చ లాంటిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల కళ్లల్లో మట్టి కొట్టే ప్రయత్నాలు ఆపాలని, అస్మత్‌పేట భూముల లేఅవుట్ల వెనుక ఉన్న రాజకీయ నాయకులను, అనుమతులు ఇచ్చిన అధికారులను తక్షణమే జైల్లో పెట్టాలని డిమాండ్ చేసారు. 60 గజాల స్థలాలు కొనుగోలు చేసిన పేదలకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే కంటోన్మెంట్ 57, 157 సర్వే నంబర్లలోని వివాదాస్పద భూముల్లో ప్రస్తుత ప్రభుత్వం లేఅవుట్లకు అనుమతులు ఇచ్చిందని, రేపు వచ్చే ప్రభుత్వం దాన్ని రద్దు చేసే అవకాశం ఉందంటూ, పేద ప్రజలెవరూ ఇలాంటి వివాదాస్పద భూములు కొని మోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *