సికింద్రాబాద్ జూన్ 28 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
రైళ్లలో ప్రయాణికులు మరిచిపోయిన రూ.29.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది ‘ఆపరేషన్ అమానత్’ కింద సురక్షితంగా రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.
సింహాపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన హైదరాబాద్‌కు చెందిన ఎస్. నాగార్జున కుమార్ కుటుంబం పొరపాటున కోచ్‌లోనే హ్యాండ్‌బ్యాగ్ వదిలేసింది. రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి ఆ బ్యాగ్‌ను స్వాధీనంచేసుకున్నారు. అందులో 172 గ్రాముల బంగారు నగలు, రూ.45 వేల నగదు, రెండు మొబైల్స్ ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.27.05 లక్షలు ఉంటుంది. మరో ఘటనలో విశాఖపట్నానికి చెందిన కె. సురేష్ అనే ప్రయాణికుడు రైలులో మరిచిపోయిన రూ.2.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ‘రైల్ మదద్’ ఫిర్యాదు ఆధారంగా ఆర్‌పీఎఫ్ సిబ్బంది రికవరీ చేసి అతనికి అందజేశారు.
కాగా, ఆపరేషన్ అమానత్ ద్వారా సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్ ఈ ఏడాది (2026)లో ఇప్పటివరకు 101 సందర్భాల్లో రూ.68.69 లక్షల విలువైన సొత్తును, గత ఏడాది (2025)లో 162 సందర్భాల్లో రూ.48.05 లక్షల విలువైన సామాగ్రిని బాధితులకు చేరవేశారు. ప్రయాణికుల సొత్తును కాపాడటంలో ప్రతిభ కనబరిచిన ఆర్‌పీఎఫ్ సీఐ బి.ఎస్. సరస్వత్, జీఆర్‌పీ సీఐ సాయి ఈశ్వర్ గౌడ్, ఎస్సైలు బి. సుబ్బారావు, ఎం. వెంకటరెడ్డి, సాయి, ఏఎస్సై శ్యామ్ సుందర్‌లను సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్ సీనియర్ డీఎస్‌సీ అలకుంట నవీన్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
