బోయిన్ పల్లి, జూలై 09.(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ కంటోన్మెంట్ మడ్‌ఫోర్ట్‌లోని జీఈ (యుటిలిటీ) కార్యాలయ ఆవరణలో ఉన్న శ్రీ దుర్గాభవాని మాత ఆలయం 16వ వార్షికోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, 7 గంటలకు హోమం, అనంతరం ఉదయం 8.30 గంటలకు మహా హారతి, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.వార్షికోత్సవ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గాభవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో జీఈ (యుటిలిటీ) మేజర్ దేవేందర్ సింగ్, సీడబ్ల్యూ ఆర్మీ–1, ఆర్మీ–2, జీఈ సౌత్, జీఈ నార్త్‌కు చెందిన అధికారులు, ఉద్యోగులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

