జలధార – జలహారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు తాగు, సాగునీటిపరంగా జిల్లా స్వరూపాన్ని అద్భుతంగా మార్చబోతున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా జలధార – జల హారతి పనులు చూపనున్న ప్రభావంపై ఆయన ఆరా తీశారు.
కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 396 చెరువులు ఉన్నాయన్నారు. వీటిలో 107 కాస్కేడ్స్ ( గొలుసుకట్లు ) ద్వారా 233 చెరువులను అనుసంధానం చేసామన్నారు. వీటిలో 9 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంటున్నట్లు చెప్పారు. ‘ జలధార – జల హారతి ‘ కార్యక్రమం కింద పూడికతీత పనులు చేపట్టి అనుసంధానం చేయటం ద్వారా వర్షాలు వస్తే ఈ చెరువులలో అదనంగా 6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలిగిందన్నారు. వరద నీరు వచ్చినప్పుడు ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి ముసి నదిలోకి నీటిని తీసుకునేలా కూడా అనుసంధానం చేసినట్లు చెప్పారు. తద్వారా మూడు నియోజకవర్గాలకు సమృద్ధిగా నీటిని ఇవ్వగలిగే అవకాశం లభించిందన్నారు. అదేవిధంగా నీటి ఎద్దడి ఉండే దొనకొండ మండలంలో కూడా పరిస్థితిని మార్చేలా రెండు కాస్కేడ్స్ ద్వారా 11 చెరువులను అనుసంధానం చేసినట్లు తెలిపారు. వీటిలోని రెండు ప్రధాన చెరువుల పూడికతీత పనులలో స్థానిక ప్రజలు, రైతులు ఉద్యమ స్ఫూర్తితో ట్రాక్టర్లు తీసుకువచ్చి పాల్గొన్నట్లు కలెక్టర్ చెప్పారు. దొనకొండ ప్రాంతంలో గుండ్లకమ్మ కాలువలను కూడా క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో కొన్ని స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా భూగర్భ నీటిమట్టం పెరిగి పరిసర గ్రామాలలో నీటి లభ్యత గణనీయంగా మెరుగవుతుందన్నారు. కాగా, జిల్లాలో చేపట్టిన ఈ పనుల తీరును ముఖ్యమంత్రి ప్రశంసించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఈ.ఈ. శివరాం ప్రసాద్, భూగర్భజల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


