కేంద్రీయవిద్యాలయలో ‘అరైవ్ అలైవ్.విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన

తిరుమలగిరి,జులై 18,(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యార్థులు రోడ్డు భద్రతానియమాలను విధిగా పాటించి సురక్షితప్రయాణాన్ని అలవర్చుకోవాలని తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) జి. శంకర్ రాజు
పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ట్రాఫిక్-I డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయలో “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ అవగాహనసదస్సులో ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు మాట్లాడటం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్లే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు లేన్ క్రమశిక్షణను అనుసరించాలని సూచించారు. జీబ్రా క్రాసింగ్‌ల వద్ద నడిచి వెళ్లే పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వయస్సు నిండి, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే స్టీరింగ్ పట్టాలని విద్యార్థులకు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై తమకున్న పలు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. తాము నిబంధనలు పాటించడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా రోడ్డు భద్రతపై చైతన్యం తెస్తామని విద్యార్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. రమణయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *