అద్భుత విజయాలు అందుకోవటానికి దృఢ సంకల్పమే బలమైన పునాది అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2025 – 26 పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ‘ షైనింగ్ స్టార్స్ ‘ అవార్డుల ప్రదాన కార్యక్రమం సోమవారం ఒంగోలు జిజిహెచ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. కలెక్టర్ తో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, బి.ఎన్.విజయ్ కుమార్, రాష్ట్ర మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తరగతి పరీక్షలలో వివిధ యాజమాన్యాలలోని 191 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి ‘ షైనింగ్ స్టార్స్ ‘ అవార్డులకు ఎంపికైనట్లు డీఈవో శ్రీమతి సివి రేణుక వివరించారు. ప్రతి మండలం నుంచి ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసామని, వీరిలో ఓసి ఇద్దరు, బిసి ఇద్దరు, ఒక ఎస్సీ, ఒక ఎస్టి విద్యార్థిని లబ్ధిదారులుగా చేసామన్నారు. ఆర్ఐఓ ఆంజనేయులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో 38 మందికి అవకాశం లభించిందన్నారు. ప్రతి గ్రూపు నుంచి ఐదుగురిని ఎంపిక చేశామని, వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరిని లబ్ధిదారులుగా చేసామన్నారు. ‘ షైనింగ్ స్టార్స్ ‘ కు ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 20వేల రూపాయల నగదు ప్రోత్సాహకం, మెడల్, ప్రశంసాపత్రాన్ని అతిథులు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఉత్తమ విధానాలను ప్రవేశపెట్టి, వాటి అమలు నిరంతరం పర్యవేక్షించడం వలన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సుమారు 46 లక్షల రూపాయలను షైనింగ్ స్టార్స్ ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించిందన్నారు. తన చిన్నతనంలో ఇలాంటి ప్రోత్సాహకాలు లేవని కలెక్టర్ చెప్పారు. చిన్నతనంలో తాను కూడా కష్టాలు ఎదుర్కొన్నానని, విద్య విలువను గుర్తెరిగి చదువుకోవటం వలనే ఉన్నత స్థానానికి చేరుకున్నానని వివరించారు. ప్రస్తుతం విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఉన్నత విద్యావంతులైన లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని, విద్యార్థులకు భద్రత, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ విద్యపై దృష్టి సారించారని వివరించారు. మార్కాపురంలో ఫుడ్ పాయిజన్ వలన విద్యార్థులు కొంత అనారోగ్యానికి గురైనప్పుడు ‘ మా బిడ్డలకు ఏమైంది..? ‘ అని నేరుగా మంత్రి లోకేష్ ఆరా తీయడమే దీనికి నిదర్శనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అందించిన ఈ ప్రోత్సాహకాన్ని విజయవంతమైన కెరియర్ కు తొలిమెట్టుగా మలచుకోవాలని సూచించారు. కుటుంబానికీ, రాష్ట్రానికీ మంచి పేరు తెచ్చేవారిగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే జనార్ధన్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లా ఈ ఏడాది మొదటి స్థానానికి వచ్చేలా మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్లో 35 వేల కోట్ల రూపాయలను కేటాయించడమే విద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియ చేస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్టులో నాణ్యమైన దుస్తులు, పుస్తకాలు, బూట్లు అందించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతూ, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రతిబిడ్డ చదువుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో అధిక సంఖ్యలో టీచర్లను భర్తీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఆయన అన్నారు. ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కందుకూరులోని తమ ప్రకాశం ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలో చేరే షైనింగ్ స్టార్స్ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉచితంగా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా విద్యే కీలకమన్నారు. అందుకే విద్యారంగానికి రాష్ట్రప్రభుత్వం పెద్ద పేట వేస్తున్నట్లు చెప్పారు. కేవలం మార్కుల పైనే కాకుండా విద్యార్థుల సమగ్ర ఎదుగుదలపై దృష్టి పెట్టిందన్నారు. వాటి ఫలితాలు స్పష్టంగా మన కళ్ల ఎదుటే ఉన్నాయని ‘ షైనింగ్ స్టార్స్ ‘ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దామచర్ల సత్య మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి సత్ఫలితాలు సాధించడంలో మంత్రి లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కీలకమైన విద్యాశాఖను తీసుకుని సంస్కరిస్తున్న తీరు, సాధిస్తున్న ఫలితాలే దీనికి నిదర్శనం అన్నారు.
పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగటం, కొన్నిచోట్ల ‘ నో అడ్మిషన్ ‘ బోర్డు పెట్టడం గొప్ప పరిణామం అన్నారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల వలన డ్రాపౌట్స్ తగ్గి, ‘ నో అడ్మిషన్స్ ‘ పెరిగాయన్నారు.
సుచిత్ర మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం అందుకుంటున్న ఈ ప్రోత్సాహకం, భవిష్యత్తు విజయాలకు తొలి అడుగు కావాలని ఆకాంక్షించారు.
కాగా, ప్రభుత్వ సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గ నిర్దేశం ద్వారా ఈ విజయాలను పొందగలిగామని పలువురు ‘ షైనింగ్ స్టార్స్ ‘ తమ అనుభవాలను ఈ వేడుకలో పంచుకున్నారు. ఈ వేడుక ప్రారంభంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ‘ షైనింగ్ స్టార్స్ ‘ తల్లిదండ్రులు పాల్గొన్నారు.







