కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల కీలక భేటీ -ఆక్వా, పొగాకు రంగాల సమస్యలపై వినతిపత్రాల సమర్పణ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల బృందం నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలుసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై ఈ సందర్భంగా చర్చించి, వినతిపత్రాలను అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది.
అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (NFDB) ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ (AQF) ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయడంపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారితో ఢిల్లీలోని ‘వాణిజ్య భవన్’లో రాష్ట్ర మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతులు, ఎగుమతిదారుల సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
వాణిజ్య భవన్‌లో జరిగిన సమావేశంలో ఆక్వాకల్చర్ రంగం సమస్యలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కార్మికులు, హేచరీలు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు గణనీయంగా పడిపోవడం, ఉత్పత్తి వ్యయం (ముఖ్యంగా ఫీడ్ ధరలు) భారీగా పెరగడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రెండు కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగా, ఫిష్ మీల్ ఎగుమతులను నియంత్రించి దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఫీడ్ తయారీ వ్యయం తగ్గించి రైతులకు ఉపశమనం కలిగించాలని కోరారు. అలాగే, నమోదు చేసుకున్న రొయ్యల ఫీడ్ తయారీ సంస్థలకు మాత్రమే పరిమిత స్థాయిలో, 2021 నాటి విధానాన్ని అనుసరించి తగిన నియంత్రణలతో జన్యుమార్పిడి (GM) సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల వల్ల ఫీడ్ తయారీ ఖర్చు తగ్గి, రైతుల ఆదాయం మెరుగుపడటంతో పాటు భారత రొయ్యల ఎగుమతుల పోటీతత్వం, విదేశీ మారకద్రవ్య ఆదాయం, లక్షలాది కుటుంబాల జీవనోపాధి రక్షించబడుతుందని మంత్రులు పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ నివాసంలో జరిగిన భేటీలో అమరావతిలో NFDB ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ (AQF) ఏర్పాటు గురించి చర్చించారు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఎగుమతుల వాణిజ్య సదస్సులో కేంద్ర మంత్రి గారు దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నెం.146 ద్వారా అమరావతి సమీపంలో 7.89 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. DPR తయారీ, పరిశీలనలు, ఆర్థిక అనుమతులు, నిధుల విడుదల , టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 2028 నాటికి ఈ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల NFDB ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ, శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చి ప్రజలకు, ఆక్వా రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. నమ్మకమైన బ్రూడ్ స్టాక్ తయారీ సంస్థల విస్తరణకు, క్వారంటైన్ నిబంధనల సడలింపునకు తగిన చర్యలు తీసుకోవాలని, 2021 నాటి భద్రతా నిబంధనలను అనుసరించి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

వాణిజ్య భవన్ సమావేశంలో పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి వినతిపత్రం సమర్పించారు. భారతదేశ ఎఫ్‌సీవీ (FCV) పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కూలీలు ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం పొగాకు ఎగుమతిదారులకు తగిన ప్రోత్సాహకాలు అందకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని మంత్రులు వివరించారు. ఈ నేపథ్యంలో, HS Code 2401 (2401 10, 2401 20, 2401 30) కింద ఉన్న అన్‌మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుకు RoDTEP పథకాన్ని వర్తింపజేయాలని, అలాగే Interest Equalisation Scheme (NIRYAT PROTSAHAN) పరిధిలోకి కూడా దీనిని తీసుకురావాలని తెలిపారు. భారత్ నుండి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులు 2021-22లో 105.21 మిలియన్ కిలోల (విలువ ₹2,909.99 కోట్లు) నుండి 2025-26 నాటికి 155.05 మిలియన్ కిలోలకు (విలువ ₹7,782.98 కోట్లు) పెరిగాయని, ఇది భారత పొగాకు నాణ్యతకు నిదర్శనమని వివరించారు. జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నందున, భారత పొగాకు ఎగుమతిదారులు అంతర్జాతీయ పోటీలో నిలబడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల, పొగాకు రైతుల సంక్షేమం, ఆయా రంగాల స్థిరాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, కేంద్ర మంత్రులు ఈ అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రుల బృందం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *