సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనంలో ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పివి రమణ, ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావులతో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యమన్నారు. బలహీన వర్గాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని చెప్పారు. రెవెన్యూయేతర సమస్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ప్రజల నుంచి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ద్వారానూ, ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారానూ అభిప్రాయం సేకరిస్తున్నందున ప్రజలతో వ్యవహరించే విధానం, సమస్యలను పరిష్కరిస్తున్న పద్ధతి సక్రమంగా ఉండాలన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తెరిగి అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులందరూ ప్రతిరోజు ముందుగా ఆన్లైన్లో గ్రీవెన్స్ అర్జీల స్టేటస్ గమనించాలని కలెక్టర్ చెప్పారు. సాంకేతిక కారణాల వలన పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
