జులై 26,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆషాఢ మాసం వర్ణశోభితమైన సందడితో, ఆధ్యాత్మిక పరిమళాలతో శోభిల్లుతోంది. తెలంగాణ రాష్ట్ర రజక మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ లో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు వైభవంగా, సంస్కృతీ సాంప్రదాయాల నడుమ కన్నులపండువగా జరిగాయి. మహిళా సంఘం జనరల్ సెక్రెటరీ అమ్ములు నాయకత్వంలో నిర్వహించిన ఈ వేడుకలో రజక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, ఒకరికొకరు మైదాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్యమురిసిపోయారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనమల్లేశ్వరపు రాజేశ్వరిమాట్లాడుతూ ఆషాఢ
మాసంలో గోరింటాకు ధరించడం మన హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన పండగలాంటిదని పునరుద్ఘాటించారు. పల్లెల్లో చెట్ల నుంచి కోసుకొచ్చిన మైదాకును రోకటితో రుబ్బి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి చేతులకు అందంగా అలకరించుకోవడం వెనుక ఎంతో అంతరార్థం ఉందని తెలిపారు. గోరింటాకును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారని, ఆషాఢ శ్రావణ మాసాలతో పాటు ప్రతీ హిందూ పండుగలోనూ దీనికి విశిష్టమైన స్థానం ఉందని ఆమె వివరించారు.
శాస్త్రీయంగానూ గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రాజేశ్వరి పేర్కొన్నారు. వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సంక్రమణ సమయంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి గోరింటాకు శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని మహిళలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మంగళకరమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో లోవ, ప్రసన్న, దుర్గ, భవాని, జ్యోతి, విజయ, ఉష, రాధ, లక్ష్మి, హనీ, నీలవేణి, తేజు తదితర మహిళా నేతలు పాల్గొన్నారు.

