సికింద్రాబాద్, జూలై 26 (జే ఎస్ డి ఎం న్యూస్)
జంట నగరాలలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లపై జీవిస్తున్నఅనాథలు, నిరాశ్రయుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 305వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు కనీసం ఒక్కపూటైనా పోషకాహారాన్ని అందించాలనే సంకల్పంతో ప్రతి నెలా రెండవ, నాలుగవ ఆదివారాల్లో క్రమం తప్పకుండా ఈ సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మానవత్వంతో చేపడుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి నగరవాసుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని, ప్రతినిధి అగస్యతో పాటు పలువురు సభ్యులు పాల్గొని స్వయంగా నిరాశ్రయులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా తమ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

