జిల్లాలో త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్ పి. రాజాబాబు చెప్పారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితిని, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణను మంగళవారం ప్రకాశం భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు.
ఈ ఏడాది వర్షాలు తక్కువ కురుస్తాయని నిపుణులు చెప్తున్నందున నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు వేయవద్దని రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను, సాగు విధానాలను రైతులకు వివరించామన్నారు. జిల్లాలో సుమారు 37 లక్షల పశువులు ఉన్నాయన్నారు. త్రాగునీటికి, పశువుల అవసరాల కోసం నీటి లభ్యత, పంపిణీ తీరును నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో 51 రైతు సేవా కేంద్రాల పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని, 261 కేంద్రాల పరిధిలో మధ్య స్థాయిలో, 64 కేంద్రాల పరిధిలో తక్కువ స్థాయిలో నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పశువులకు నీటి కోసం 12131 బోర్లను మ్యాపింగ్ చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రధానమైన రామతీర్థం, గుండ్లకమ్మ రిజర్వాయర్లలోని నీటితో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపినట్లు చెప్పారు. ఫలితంగా ఆయా చెరువులలో సుమారు 55 శాతం నీరు ఉన్నట్లు వివరించారు. వచ్చే నెలాఖరు నాటికి నాగార్జునసాగర్ నీళ్లు వస్తాయని, వాటితో చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామన్నారు. అందుబాటులో ఉన్న నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. సాగు అవసరాలు, చేపల చెరువులకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పశుగ్రాసానికి ప్రస్తుతం ఇబ్బంది లేదని, భవిష్యత్తులోనూ ఈ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
1077 టోల్ ఫ్రీ నెంబర్
త్రాగు, పశుపోషణకు నీరు రాకపోయినా, బోర్లు, మోటార్ల సమస్యలు తలెత్తినా తక్షణమే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. దీనికోసం కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అవసరమైతే 24 గంటలూ పనిచేసేలా చూస్తామన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు 24 గంటల్లోనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయంగా టాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తామన్నారు.
ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. నాగేశ్వరరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో జాలమ్మ పాల్గొన్నారు.
