పి.జి.ఆర్.ఎస్. లో నమోదైన ప్రతి అర్జీకి నాణ్యతా ప్రమాణాలతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
నాణ్యత ప్రమాణాలతో అర్జీలను పరిష్కరించక పోవడంతోనే పునరావృతం అవుతున్నాయని కలెక్టర్ చెప్పారు. అర్జీలు పునరావృతం గాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీజీ ఆర్ఎస్, ఐ.వి.ఆర్.ఎస్. పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పరిష్కారమైన ప్రతి అర్జీకి సంబంధించిన అర్జిదారుడికి ఫోన్ కాల్స్ వెళ్తాయన్నారు. పరిష్కరించకుండానే పరిష్కారమైనట్లు చూపితే అలాంటి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. పీజీఆర్ఎస్ పై నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి ఒక్క అర్జీదారుడికి న్యాయం చేయాలనే తాత్పర్యంతో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. పునరావృతం అవుతున్న అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఒంగోలు ఆర్డిఓ కు 20 శాతం అర్జీలు పునరావృతం అవుతున్నాయని, అలాగే కందుకూరు ఆర్డీవో వద్ద అధికంగా నమోదవడంపై ఆరా తీశారు. డి ఆర్ ఓ వద్ద నాలుగు, జిల్లా పంచాయతీ అధికారి వద్ద నాలుగు, వివిధ శాఖలో నమోదవడంపై ప్రశ్నించారు. అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. పారిశుద్ధ్యంపై 65 శాతమే ఐ వి ఆర్ ఎస్ లో ప్రజా ఆమోదం నమోదు కావడంపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో చెత్త సేకరణ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయి చెత్త సేకరణ, పారిశుధ్యంపై అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్యం 61శాతమే ఉండడం ఏమిటని నిలదీశారు. గుంతల రహిత రహదారులపై 64 శాతమే సానుకూలత ఉందన్నారు. పారిశుద్ధ్యం పచ్చదనం పెంచాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయం బాగుండాలి, ప్రజల నుంచి మంచి స్పందన లభించేలా అధికారులు పనిచేయాలన్నారు.
తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేనందున, తాగునీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బోర్లు మరమ్మతు చేయాలని, వినియోగంలో లేని బోర్లను వినియోగంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం గాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే విద్యుత్ సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ ఐ ఆర్ లో 1.96 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్లకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అద్దంకిలో 47% ఇవ్వకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మండల స్థాయిలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

