కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలలో లబ్ధిదారులకు త్వరగా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ( ఇంచార్జి ) పి.వి.రమణ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రుణాల మంజూరు విషయమై బ్యాంకులకు ఇచ్చిన లక్ష్యం, ఈ దిశగా రుణాల పంపిణీపై ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షించారు. ఈ ఏడాది మొత్తం రూ.28,335 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, మొదటి త్రైమాసికంలో రూ.8961 కోట్ల ( 31.63 శాతం )ను అర్హులకు ఇచ్చినట్లు ఎల్.డి.ఎం. రమేష్ వివరించారు. దీనిపై జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్హులకు రుణాల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. అర్హత కలిగిన పశుపోషకులు, మత్స్యకారులందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వాలని చెప్పారు. పీఎంఎఫ్ఎంఈ రుణాలను కూడా సత్వరం అందేలా చూడాలన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వాలు జమ చేస్తున్న నిధులను రుణాల రికవరీ పేరుతో బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయని, బ్యాంకులు కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో ఆర్బిఐ లీడ్ బ్యాంక్ ఆఫీసర్ ఎలమందరెడ్డి, నాబార్డ్ డిడిఎం రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, డి.ఆర్.డి.ఏ, మెప్మా పీడీ నారాయణ, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా హౌసింగ్ అధికారి శ్రీనివాస ప్రసాద్, రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్, ఉద్యానవన, చేనేత జౌళి శాఖల అధికారులు పాల్గొన్నారు.
