​ప్రకాశం జిల్లాలో ఘనంగా ప్రారంభమైన “కౌశలం” ప్లేస్‌మెంట్ డ్రైవ్ – పెద్ద ఎత్తున హాజరైన ఉద్యోగార్థులు- 138 మంది ఉద్యోగాలకి ఎంపిక – ​మంత్రివర్యులు డోలా. బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, శాసనసభ్యులు దామచర్ల .జనార్దన్ రావు సమక్షంలో ప్రారంభోత్సవం.​

జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ పి. రాజబాబు ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగాన్ని తరిమికొట్టి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నత సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ITE&C మరియు SGSW శాఖలు) రూపొందించిన ప్రతిష్ఠాత్మక “కౌశలం (Kaushalam)” కార్యక్రమం ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని PGRS హాల్ నందు నిర్వహించిన ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జిల్లా స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు శాఖ అధికారి M. వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్ పి. రాజబాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

​ఈ సందర్భంగా మంత్రి డోలా. బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు టీచర్స్, పోలీస్ వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపడుతూనే, మరోవైపు ప్రైవేటు రంగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు ‘కౌశలం’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ‘కౌశలం’ ప్లేస్‌మెంట్ కార్యక్రమాల ద్వారా 10,000 మందికి పైగా యువత వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచారని తెలిపారు. నిరుద్యోగులను గుర్తించి, నైపుణ్య శిక్షణ అందించి, తగిన ఉద్యోగానికి అనుసంధానించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ సువర్ణ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.కష్టపడటం, నైపుణ్యం పెంపొందించుకోవడం, పట్టుదలతో ముందుకుసాగడమే విజయానికి మూలసూత్రమని, జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని అందుకొని తమ ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు.

జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ, ‘కౌశలం’ వేదిక ద్వారా యువత అర్హతలను, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో మూల్యాంకనం (Skill Assessment) చేసి పారదర్శక పద్ధతిలో రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో యువత చిన్న వయస్సు నుంచే స్వశక్తితో జీవిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తారని, అదే విధంగా మన యువత కూడా విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఆధారితంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రారంభంలోనే అధిక వేతనాలు, సౌకర్యాలు ఆశించకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మార్గదర్శనం చేశారు.

​ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రకాశం జిల్లా యువతను తీర్చిదిద్ది వారికి స్థానికంగానే కాకుండా పారిశ్రామిక ప్రాంతాల్లో ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం, నిబద్ధత పెరిగినప్పుడే విజయం సొంతమవుతుందని, అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగి ఈ సదుపాయాన్ని అందుకోవాలని సూచించారు.

గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ (GTI) ప్రతినిధి రాంబాబు మాట్లాడుతూ, తాను స్వగ్రామం ఒంగోలులోనే పుట్టి పెరిగి, ఇదే కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరి నిరంతర శ్రమతో నేడు డిప్యూటీ మేనేజర్ స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకుంటూ యువతలో స్ఫూర్తి నింపారు. ఈ జాబ్ డ్రైవ్ ద్వారా నాయుడుపేట SEZ లోని గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ లో ఫౌండ్రీ, మెషిన్ షాప్ విభాగాల్లో 750 ఖాళీల భర్తీ ప్రక్రియ సాగుతోందని, ఎంపికైన 1,204 మంది అభ్యర్థులకు ఈ సాయంత్రమే నియామక పత్రాలు (Orders) అందించి వచ్చే సోమవారమే విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వీరికి రూ. 15,500 నుండి రూ. 16,500 వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి, రవాణా, ESI, EPF మరియు 6 నెలల సేవ తర్వాత “MTE Serbia” (యూరోప్) లో 1 సంవత్సరం పాటు ఉచిత శిక్షణ పొందే అంతర్జాతీయ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

​ ​ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ONUDA చైర్మన్ షేక్ రియాజ్, AMC చైర్మన్ వెంకట్రావు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ (DRO) వెంకటరమణ, ప్రతిష్ఠాత్మక గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ (Green Tech Industries India Pvt. Ltd.) డిప్యూటీ మేనేజర్ రాంబాబు, గురుసాయి, ఇతర ప్రజాప్రతినిధులు మరియు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *