ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ (PGRS) ద్వారా ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి అత్యున్నత ప్రాధాన్యమిచ్చి, వేగవంతంగా మరియు నాణ్యమైన పరిష్కారం చూపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, డిఆర్ఓ శ్రీ పి. వెంకటరమణలతో ఎస్ డి సి మాధురి, ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వరరావు లతో కలిసి ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 246 అర్జీలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వస్తున్న వినతుల పట్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. పిజిఆర్ఎస్ ద్వారా నమోదైనవి, నేరుగా కలెక్టరేట్‌లో అందజేసినవి, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి వచ్చినవి, మండల స్థాయి వినతులు మరియు ‘పల్లె నిద్ర’ వంటి ప్రత్యేక కార్యక్రమాలలో వచ్చిన ప్రతి ఒక్క అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి అర్జీదారునికి జిల్లా కార్యాలయం నుండే స్వయంగా ఫోన్ చేసి, అర్జీ నమోదైన వివరాలను తెలియజేస్తూ, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టమైన భరోసా కల్పించే ప్రక్రియను జిల్లా అధికారులు తక్షణమే ప్రారంభించాలన్నారు .
కేవలం కింది స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపైనే ఆధారపడకుండా, జిల్లా స్థాయి అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను స్వయంగా పరిశీలించి, వాటిని త్వరితగతిన గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అర్జీలను కేవలం సాంకేతికంగా ముగించడం (Rejection) కాకుండా, ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోగా (SLA) నాణ్యమైన మరియు సహేతుకమైన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల తమ స్థాయిలో పరిష్కరించలేని పరిస్థితి ఉంటే, దానికి గల స్పష్టమైన కారణాలను అర్జీదారులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. అంతేకాకుండా అర్జీదారులలో సంతృప్తి స్థాయిని పెంచాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐ.వి.ఆర్.ఎస్. (IVRS) ఫోన్ కాల్స్ సర్వేలో ప్రజల నుంచి అత్యుత్తమ సానుకూల అభిప్రాయం లభించేలా అధికారులు చురుగ్గా పనిచేయాలని, రీ-ఓపెన్ అయ్యే అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. శాఖాపరంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల అమలును నిరంతరం పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, మరియు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


