సికింద్రాబాద్, సెప్టెంబర్ 09, (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మక గాంధీ సర్వజన ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఉషారాణిని ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆసుపత్రికి నిరంతరాయంగా ఔషధాలు, సర్జికల్ ఉపకరణాలు, వైద్య సామగ్రిని సరఫరా చేస్తున్న ఏజెన్సీలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా వివిధ సరఫరాలకు సంబంధించిన బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం వల్ల తాము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని సూపరింటెండెంట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరాదారులకు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేక, రోజువారీ వ్యాపార నిర్వహణ భారంగా మారిందని వారు వివరించారు.
రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం సేవలు అందిస్తున్న సరఫరాదారుల పరిస్థితిని గుర్తించి, పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని వారు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా బిల్లుల చెల్లింపులు క్రమం తప్పకుండా జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న నూతన సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ బిల్లుల విడుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే.బి. రామచంద్రతో పాటు ముఖ్య ప్రతినిధులు రఘు, మతిన్ పాషా, మధు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
