బేగంపేట సెప్టెంబర్ 10,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సమాజ సేవ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత అలవడతాయని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మావతి పేర్కొన్నారు. కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంపికైన నూతన ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లకు బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనిట్–II ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి. సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఎన్ఎస్ఎస్ ముఖ్య లక్ష్యాలు, నిర్వహించే సేవా కార్యక్రమాలు, సమాజం పట్ల విద్యార్థుల పాత్రపై సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మావతి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే సేవా భావాన్ని అలవర్చుకోవాలని, ప్రతి వాలంటీర్ సమాజ హితం కోసం పాటుపడుతూ ఆపన్నులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సరిత మాట్లాడుతూ, విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి ఎన్ఎస్ఎస్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన స్టేట్ ఎన్ఎస్ఎస్ అవార్డు గ్రహీత, రాజ్మాతా ఫౌండేషన్ ప్రతినిధి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, మానవతా విలువలను నేర్పే గొప్ప పాఠశాల అని తన అనుభవాలను పంచుకుంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
‘నేను కాదు – నువ్వు’ (నాట్ మీ బట్ యూ) అనే నినాదంతో ప్రతి ఒక్కరూ సేవా పథంలో ముందుకు సాగాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పద్మావతి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.డి.సరితలను అవార్డులతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మృదుల, డాక్టర్ ప్రసన్న, నరసింహులు, డా .వెంకటేశ్వర్లు, మధుకర్ రావు, డాక్టర్ రామాచారితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.


