అన్ని వర్గాల డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఒంగోలు నగరంలో రూ.3.40 కోట్లతో నిర్మించిన ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఎస్.ఈ. కార్యాలయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, సంతనూతలపాడు బి.ఎన్. విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, నాణ్యమైన సరఫరా కోసం ట్రాన్స్మిషన్ వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఒంగోలులోని సర్కిల్ కార్యాలయాన్ని ఏడాదిన్నరలో నిర్మించామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 132/220/400 కేవీ సబ్ స్టేషన్లను నిర్మిస్తోందన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రూ. 6 వేల కోట్లతో సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 సబ్ స్టేషనులను నిర్మిస్తున్నామని, నాలుగైదు నెలల్లోనే వీటిని ప్రారంభిస్తామన్నారు. రైతులకు సత్వరమే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిందని, అయినా ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జెన్కో వ్యవస్థను బలోపేతం చేసి నిరంతరాయ విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటే తక్కువ ధరకు బహిరంగ మార్కెట్ లో కొనుగోలుకు ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్ డిమాండ్ ను అందుకునేందుకు పునరుత్పాదక ఇంధన వనరులను కూడా వినియోగించుకుంటున్నామన్నారు. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా పీక్ అవర్స్ లో విద్యుత్ డిమాండ్ ను అందుకోగలుగుతున్నామని, పీఎం సూర్యఘర్ త్వరగా పూర్తి చేసినట్లయితే కొంతమేర విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని వివరించారు. సూర్యఘర్ పథకం కింద రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఐదు లక్షల కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒంగోలులో స్మార్ట్ సిటీకి అవరోధం లేకుండా విద్యుత్ లైన్లు మార్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సమయం మాదిరిగానే విద్యుత్ కూడా ఎంతో విలువైనదన్నారు. వృధా చేయకుండా వాడుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎమ్మెల్యే జనార్ధన్ మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన ప్రజలకు మెరుగైన విద్యుత్ లభిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు లో ఇప్పటికే ఒక సబ్ స్టేషన్ ప్రారంభించామని, కొత్తపట్నం సబ్ స్టేషన్ ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను మార్చేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. రాజగోపాల్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


