ప్రకాశం జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు- పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనది.. ప్రజల నమ్మకాన్ని పెంపొందించే గొప్ప సేవ: జిల్లా కలెక్టర్ రాజబాబు…..పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనది.. ప్రజల నమ్మకాన్ని పెంపొందించే గొప్ప సేవ: జిల్లా కలెక్టర్ రాజబాబు-దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం, నిత్య స్ఫూర్తిదాయకం – జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ – పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ మరియు జిల్లా అధికారులు

అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు బుధవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ రాజబాబు ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, మరియు పోలీసు అధికారులు పాల్గొని అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
పెరేడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ……. పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే గొప్ప సేవ అని కొనియాడారు. విధి నిర్వహణలో 154 మంది పోలీసులు ప్రాణత్యాగం చేయడం వారి అంకితభావానికి, త్యాగనిరతికి నిదర్శనమన్నారు. పోలీసులంటే ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంటుందని, ఏ చిన్న సంఘటన జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనని తెలిపారు. మహిళల విషయంలో చిన్నపిల్లల విషయంలో ఏదైనా సంఘటన జరిగితే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనన్నారు. పోలీసు విధి నిర్వహణలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. విధి నిర్వహణలో విమర్శలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా అధిగమిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. గత సంవత్సర కాలంగా జిల్లాలో నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని, రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. మహిళల రక్షణ విషయంలోనూ గణనీయమైన పురోగతి ఉన్నదని కలెక్టర్ గారు తెలిపారు.

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ …… శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమై, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర పోలీసు సోదరులకు అశ్రునివాళులర్పిస్తూ యావత్ భారతదేశం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. 1959 వ సంవత్సరము అక్టోబరు 21వ తేదిన జమ్మూ కాశ్మీర్ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 5000 మీటర్ల ఎత్తున గల దేశ సరిహద్దు అయిన లడక్ లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతములో భారత దేశం పై చైనా దురాక్రమణకు పాల్పడినదని, రక్తాన్ని గడ్డకట్టించే చలిలో దేశరక్షణ కోసం కాపల డ్యూటీ లో వుండి అకస్మాత్తుగా దొంగదెబ్బ తీసిన చైనా ముష్కర సైనికులతో వీరోచిత పోరాటము చేసి 10 మంది జవాన్లు అశువులు బాసారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరము అక్టోబరు 21 న “పోలీసు అమర వీరుల సంస్మరణ దినం” జరుపుకుంటున్నామని, ఇటీవలే భారత ప్రభుత్వము అక్టోబరు 21వ తేదీని “నేషనల్ పోలీస్ డే” గా ప్రకటించిందని తెలిపారు.

మన దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న సైనికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువులతో వీరోచితంగా పోరాడుతున్నారని తెలిపారు. అదే విధంగా, సమాజ రక్షణ కోసం శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన పోలీసు సోదరులు ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం, ఫ్యాక్షనిజం వంటి విచ్ఛిన్నకర శక్తులతో పాటు నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులపై పోరాడుతూ సమసమాజ నిర్మాణానికి కంకణబద్ధులై అమరులౌతున్నారన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతి నిత్యం స్ఫూర్తిదాయకమని, పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ వారి త్యాగాలు ఉత్తేజాన్ని అందించాలని ఆకాంక్షించారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, మన హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని వారి అమూల్యమైన త్యాగాలకు సెల్యూట్‌ చేస్తూ ఘనంగా నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.

సరిహద్దులను కాపాడే సైన్యంతో పోల్చుకుంటే, సమాజంలో అంతర్గత శాంతిభద్రతలను కాపాడే పోలీసుల విధినిర్వహణ క్లిష్టంగా మరియు ప్రాణాంతకంగా తయారై, పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగా తయారయిందనే విషయం మీకందరికీ తెలిసిందే. సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసు శాఖపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. శాఖాపరమైన ప్రతిష్ట అక్కడ ముడిపడి వుంటుంది. అందుకే విధినిర్వహణలో భాగంగా మనము అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. అయిననూ అన్నింటికి ఓర్చుకొని, సాంప్రదాయక పోలీసు విదానలతో పాటుగా, ఆధునిక పోలీసింగ్ టెక్నిక్ లు అలవరచుకొని, సమాజంలో ప్రతిఒక్కరు మనల్ని మెచ్చుకునేలా వ్యవహరిస్తూ ఆడుగు ముందుకు వేయవలసి వుంటుంది. మనదేశంలో ఈ సంవత్సరము శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమై విధినిర్వహణలో 154 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. మృతవీరులందరికి జోహార్లు తెలియజేస్తూ నివాళులు అర్పిద్దాం. నేటి మననిశ్చింత జీవనం వారి అవిశ్రాంత త్యాగఫలం అందుకే ఆ అమరులను స్మరించుకుందాం.

గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు 1.కీర్తిశేషులు అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ ఐ.పీ.ఎస్., గారు 2.కీర్తిశేషులు శ్రీ లేళ్ళ శంకర్ జూనియర్ కమాండర్, గ్రేహౌండ్స్ 3.కీర్తిశేషులు మోటా ఆంజనేయులు జూనియర్ కమాండర్, గ్రేహౌండ్స్ 4.కీర్తిశేషులు కె.వి ప్రశాంతరావు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 5.కీర్తిశేషులు చప్పిడి వెంకట రత్నం ఆర్మడ్ రిజర్వు కానిస్టేబుల్ 6.కీర్తిశేషులు శ్రీ ఎస్ కె మహమ్మద్ రఫీ కానిస్టేబుల్ 7.కీర్తిశేషులు ఈ.పవన్ కుమార్ కానిస్టేబుల్ లను త్యాగాలను జిల్లా ఎస్పీ కొనియాడారు.

అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు చెందిన 12 మంది పోలీసులు విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అమరులైన సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ గారు బహుమతులు అందజేశారు.

ఈ సంవత్సరం దేశ వ్యాప్తముగా ప్రాణాలను కోల్పోయిన 154 మంది పోలీస్ బలగాల సిబ్బంది యొక్క పేర్లులను అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యన్.యుగంధర్ బాబు గారు ఈ కార్యక్రమములో చదివి విన్పించి శ్రద్దాంజలి ఘటించినారు.

అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసులు అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేసినారు.

ఈ కార్యక్రమంలో ఉప రవాణా శాఖ కమిషనర్ అర్.సుశీల, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యన్.యుగంధర్ బాబు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్)వెంకటేశ్వర్లు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీధర్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, RIలు ఎస్సైలు,అమర వీరుల కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *