బేగంపేట అక్టోబర్ 21,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండుగ విజయ దశమి అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ లలో నిర్వహించిన విజయ దశమి వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్స్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు రావణుడిని వధించడం మరియు అమ్మవారు మహిషాసురుడిని సంహరించడం ఈ రోజు విశిష్టత అని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత దసరా పండుగ ను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. చెడు ఎంత శక్తివంతమైనదైనా, చివరికి సత్యం మరియు ధర్మమే గెలుస్తుందని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుందని తెలిపారు. మనలోని కోపం, అసూయ, స్వార్థం వంటి దుర్గుణాలను అణచివేసి, సద్గుణాలతో ముందుకు సాగడమే ఈ పండుగ అసలు పరమార్థం అని ఆయన వివరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, సనత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సెవెన్ టెంపుల్స్ EO సత్యనారాయణ నాయుడు, ఆలయ ముఖ్య అర్చకుడు పరాశరం రవీంద్ర చార్యులు, నాయకులు సురేష్ గౌడ్, కొలన్ భూపాల్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, భార్గవ్, ఇబ్రహీం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాసారం బస్తీలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమీర్ పేట లో…
అమీర్ పేట డివిజన్ లోని ధరం కరం రోడ్డులో గల మున్సిపల్ గ్రౌండ్ లో బాలాజీ రాజస్థాన్ మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ దశమి వేడుకలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య హాజరయ్యారు. అమ్మవారి ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.రాముడు, లక్ష్మణుడు తదితర వేష ధారణలతో చిన్నారులు అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం జరుపుకునే ప్రతి పండుగ కు ఒక చరిత్ర ఉందని తెలిపారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కొత్త విజయాలను, సుఖశాంతులను నింపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, కరుణాకర్ రెడ్డి, కట్టా బలరాం, ఉత్తమ్ సింగ్, గులాబ్ సింగ్, పీయూష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: