సికింద్రాబాద్ అక్టోబర్ 29(జే ఎస్ డి ఎం న్యూస్ )
ప్రమాదకర విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని సీఈ కరుణాకర్ ఆదేశించారు.
విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘ప్రజాబాట – బస్తీబాట’ కార్యక్రమం గురువారం జనరల్ బజార్ సెక్షన్ పరిధిలోని విక్టోరియా గంజ్ బస్తీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ (సీఈ) కరుణాకర్ బాబు, సికింద్రాబాద్ సర్కిల్ ఎస్ఈ వేణుగోపాల్‌లతో కూడిన అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక విద్యుత్ సమస్యలను పరిశీలించింది. బస్తీలోప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే గుర్తించి మార్చాలని, కాలనీ అవసరాలకు అనుగుణంగా త్రీ-ఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని సీఈ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఈ కరుణాకర్ బాబు మాట్లాడుతూ, పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో చెత్త వేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే ముప్పు తీవ్రంగా ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా ఫ్యూజులు వేయడం, అత్యవసర మరమ్మతులు చేపట్టే సమయాల్లో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల పరిసరాల్లో ఎలాంటి వ్యర్థాలు వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, శాఖకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు.
ఈ పర్యటనలో ప్యారడైజ్ డీఈ రమణారావు, ఏడీఈ శివదుర్గాప్రసాద్, ఏఈ కాసం రవికుమార్, బస్తీ అధ్యక్షుడు ఎస్.ఆర్. మల్లేష్, ఉపాధ్యక్షుడు ఎస్. అర్జున్, ప్రధాన కార్యదర్శి డి. శివకుమార్, కార్యదర్శి ఐ. కిరణ్, కోశాధికారి ఎస్. సంజీవ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎం. మల్లేష్, కె. యాదగిరి, ఎం. సురేష్‌లతో పాటు జనరల్ బజార్ విద్యుత్ విభాగం సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: