వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ‘ఏఐ’పై ప్రత్యేక శిక్షణ.
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మూడు రోజుల అవగాహన సదస్సు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హైదరాబాద్ అక్టోబర్ 29,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగులు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) పై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవాలని నిపుణులు సూచించారు. హైదరాబాద్‌లోని డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ఏఐ బాధ్యతాయుత, సురక్షిత వినియోగంపై నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచి, పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని శిక్షకులు స్పష్టం చేశారు.
రోజువారీ పాలనా విధుల్లో ఏఐ సాధనాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించవచ్చని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల గుర్తింపు, సమగ్ర నివేదికల రూపకల్పన, సమాచార విశ్లేషణ వంటి పనులను ఏఐ ద్వారా తక్కువ సమయంలోనే పూర్తి చేయవచ్చని తెలిపారు. దీనివల్ల ఆదా అయ్యే విలువైన సమయాన్ని క్షేత్రస్థాయిలోని ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి విభాగంలో ఏఐ వినియోగానికి గల అవకాశాలను గుర్తించి, తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశాకే పూర్తిస్థాయిలో విస్తరించాలని వివరించారు.
అదే సమయంలో సమాచార భద్రత, డేటా గోప్యత విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరించారు. అనధికారిక ఏఐ టూల్స్‌లో ప్రభుత్వ రహస్య పత్రాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరచరాదని స్పష్టం చేశారు. ఏఐ రూపొందించిన సమాచారాన్ని అధికారిక రికార్డుల్లో నమోదు చేసేముందు క్షుణ్ణంగా ధ్రువీకరించుకోవాలని, తుది నిర్ణయాలకు సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.
ఈ శిక్షణలో వివిధ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు చెందిన వైద్యులు, పరిపాలనా సిబ్బందితో పాటు ల్యాబ్ బయోకెమిస్టులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఏఐ సాంకేతికతను జోడించడం ద్వారా రోగులకు ల్యాబ్ సేవలు, పరీక్షల నివేదికలు త్వరితగతిన అందుతాయని బయోకెమిస్ట్ మంచాల రవీందర్ పేర్కొన్నారు. ప్రజలకు లభించే సేవల్లో కనిపించే స్పష్టమైన సానుకూల మార్పే ఏఐ విజయానికి గీటురాయి అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే రోగులు వివిధ విభాగాల వద్ద గంటల తరబడి వేచి ఉండే సమయాన్ని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని కొడంగల్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాజు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *