హైదరాబాద్ అక్టోబర్ 29, (జేఎస్ డి ఎం న్యూస్) :
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల మహోన్నత త్యాగాలకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ గురువారం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ రోగుల అత్యవసర చికిత్సలకు అండగా నిలిచేందుకు నగరవ్యాప్తంగా 38 కేంద్రాల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. సుమారు 30 బ్లడ్ బ్యాంకుల సహకారంతో దాదాపు 5,700 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగానిర్దేశించుకుని ఈ శిబిరాలను నిర్వహించారు.
ఇందులో భాగంగా పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు నగర పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ అక్టోబరు 21 నుంచి 31 వరకు అమరవీరుల స్మరణార్థం రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజ రక్షణ లో భాగంగా పోలీసులు పండుగలు, సెలవులను సైతం విడిచిపెట్టి శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరంత్యాగనిరతి,చాటుకుంటున్నారని కొనియాడారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానాన్ని ఉద్యమంలా చేపట్టి, సేకరించిన రక్తాన్ని ప్రభుత్వఆసుపత్రులకు అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధితులకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం సంజీవనిలా ఉపయోగపడుతుందన్నారు. ఇదే సమయంలో రక్తదానం, అవయవదానంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రైవేటు ఆసుపత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ అమరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నిజమైన నివాళి అర్పించాలనే సంకల్పంతోనే కమిషనరేట్ పరిధిలో పెద్దఎత్తున ఈ శిబిరాలునిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు, అలాగే రెడ్ క్రాస్,
తలసేమియా ఫౌండేషన్, రోటరీ, లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్) ఎం. శ్రీనివాసులు ,అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్) తప్సీర్ ఇక్బాల్ , జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) ఆర్. వెంకటేశ్వర్లు ఐపీఎస్,.రాహుల్ హెగ్డే, డిసిపి ట్రాఫిక్, విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీలావణ్యనాయక్ జాదవ్ తో పాటు అన్ని జోన్ల డీసీపీలు, ఇతర అధికారులు, బ్లడ్ బ్యాంకులకు చెందిన వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: