హైదరాబాద్ సిటీ పోలీసులఅమ్ములపొదిలోకి ఈవీ స్మార్ట్ వాహనాలు…….స్పందనకు 7,శాంతిభద్రతల విధులకు 8 కార్ల కేటాయింపు………15 ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌……మహిళలు, పిల్లల రక్షణే ధ్యేయంగా ‘స్పందన’ విస్తరణ.

హైదరాబాద్ అక్టోబర్ 29,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
హైదరాబాద్ సిటీ పోలీస్‌లోకి సరికొత్తగా ఈవీ స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు చేరాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధుల తక్షణ రక్షణ కోసం ప్రత్యేకంగాపనిచేస్తున్న స్పందన
బృందాలకు 7, శాంతిభద్రతల పెట్రోలింగ్ విధుల కోసం 8 కలిపి మొత్తం 15 టాటా పంచ్‌ ఈవీ స్మార్ట్‌+ వాహనాలను కేటాయించారు. పెట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో గురువారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు.
అత్యాధునిక 40 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందిన ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు.
నగరంలోని అత్యంత ఇరుకైన వీధులు, గల్లీల్లోకి సైతం శరవేగంగా దూసుకెళ్లగలగడం వీటి ప్రత్యేకత
.తద్వారా ఆపదలో ఉన్న బాధితులకు స్పందన సిబ్బంది ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ అత్యవసర సాయాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద హైద‌రాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్‌సీఎస్సీ) వీటిని స‌మ‌కూర్చింది .ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సాధారణంగా ఠాణాల్లోని పెట్రోల్ కార్లు, బ్లూ కోల్ట్స్ వాహనాలు నిత్య శాంతిభద్రతల విధులు, ఇతర పిటిషన్ల విచారణలోనే నిమగ్నమై ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తక్షణమే రంగంలోకి దిగే ప్రత్యేక స్పందన బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా ప్రత్యేక వాహనాలు సమకూరడంతో స్పందన మరింత బలోపేతమైందని, ఆపదలో ఉన్నవారి నుంచి కాల్స్ రాగానే క్షణాల్లో ఘటనా స్థలానికి వాహనాలను పంపించేలా ‘డయల్ 112’ కంట్రోల్ రూమ్ వ్యవస్థతో పక్కాగా సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సత్వర చర్యలు చేపట్టేందుకు వీలుగా సీఎస్సార్‌ కింద ఈ వాహనాలను సమకూర్చిన దాతలకు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ)కి ధన్యవాదాలు తెలిపారు.అనంతరం హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి తక్షణ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్పందన’ వాహనాలకు ప్రజల నుంచి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే మహిళా పోలీస్ డ్రైవర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఇరుకైన ప్రాంతాల్లోనూ మరింత వేగంగా బాధితులను చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ‘స్పందన’ మహిళా నేతృత్వ అత్యవసర స్పందన వ్యవస్థ క్షేత్రస్థాయిలో విశేష ఆదరణ పొందుతోంది. నగరంలోని 7 లా అండ్ ఆర్డర్ జోన్లలో 14 బృందాలు విధులునిర్వహిస్తుండగా, ప్రతి వాహనంలో మహిళా డ్రైవర్‌తో పాటు ఒక సివిల్ ఉమెన్ కానిస్టేబుల్, ఒక ఆర్మ్‌డ్ రిజర్వ్ ఉమెన్ కానిస్టేబుల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్షేత్ర బృందాలు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి గం 12:30ల వరకు రెండు షిఫ్టుల్లో సేవలందిస్తుండగా, పోలీస్ కంట్రోల్ రూమ్ విభాగం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. మహిళా అధికారులే నేరుగా సంఘటనా స్థలానికి చేరుతుండటంతో బాధితులు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ వేదననుచెప్పుకోగలుగుతున్నారు.
గత 185 రోజుల్లో ఈ బృందాలు రికార్డు స్థాయిలో 8,903 ఫిర్యాదులను విజయవంతంగా అటెండ్ అయ్యాయి. ఇందులో 1,900 సమస్యలను నిరంతర కౌన్సిలింగ్ ద్వారా, 1,164 వివాదాలను పరస్పర రాజీతో సామరస్యంగా పరిష్కరించి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా నివారించాయి. క్షేత్ర విచారణ అనంతరం తీవ్రమైన అంశాలపై 2,504 కేసులను స్థానిక ఠాణాలకు పంపగా 61 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. గృహహింస, వేధింపులు, ఆత్మహత్యాయత్నాల వంటి సున్నితమైన ఘటనలపై తక్షణం స్పందించి పలువురిని ‘సఖి’ కేంద్రాలు, షెల్టర్ హోమ్‌లకు చేర్చారు. తప్పిపోయిన నలుగురు చిన్నారులను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్స్) ఎమ్. శ్రీనివాసులు, అడిషనల్ సీపీ (లా & ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) ఆర్. వెంకటేశ్వర్లు, డీసీపీ (ట్రాఫిక్) బి.కే. రాహుల్ హెగ్డే, డీసీపీ (గోల్కొండ జోన్) జె. రాఘవేంద్ర రెడ్డి, డీసీపీ (జూబ్లీహిల్స్ జోన్) ఎ. రమణారెడ్డి, డీసీపీ (ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్) డాక్టర్ పి. లావణ్య, ఐపీఎస్, హెచ్‌సీఎస్‌సీ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో పాటు వాహనాలు విరాళంగా అందించిన దాతలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *