జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జెడ్పిటీసి, ఎంపిటీసి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జెడ్పి సీఈఓ బి. చిరంజీవి

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల (జెడ్పిటీసి, ఎంపిటీసి) ఎన్నికల నిర్వహణ, పోలింగ్ మరియు కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ZP CEO) బి. చిరంజీవి గారు ఒంగోలులో వివరమైన పత్రికా సమావేశం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత, పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
మరియు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ (SEC) మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
​మున్సిపల్ ఎన్నికల కారణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి నిర్ణయం మేరకు ఈ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 5వ తేదీకి మార్చడం జరిగిందని సీఈఓ తెలిపారు. నవంబర్ 5వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సాయంత్రం 5:00 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ స్లిప్పులు అందజేసి వారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి రీ-పోలింగ్ అవసరమైతే నవంబర్ 6వ తేదీన నిర్వహిస్తామని, అనంతరం నవంబర్ 7వ తేదీన లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ ఉంటుందని వివరించారు.
​జిల్లాలోని 27 మండలాల పరిధిలో జెడ్పిటీసి స్థానాల ఎన్నికల స్థితిగతులను వివరిస్తూ, మర్రిపూడి మరియు పొన్నలూరు (కొండేపి) స్థానాలు ఏకగ్రీవం కావడం వల్ల మిగిలిన 25 జెడ్పిటీసి స్థానాలకు ఎన్నికలు
జరుగుతున్నాయని తెలిపారు. మర్రిపూడి నుండి గురిజాల రాజు, పొన్నాలురు నుండి పి. మాధవిలు తెలుగుదేశం పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 25 స్థానాలకు గాను మొత్తం 96 మంది అభ్యర్థులు పోలింగ్ బరిలో ఉన్నారని తెలిపారు. బరిలో ఉన్నవారిలో వైఎస్ఆర్సిపి తరపున 25 మంది, తెలుగుదేశం పార్టీ తరపున 22 మంది, బిఎస్పి తరపున 5 గురు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున 5 గురు, జనసేన పార్టీ తరపున 3 గురు, సిపిఐ మరియు సిపిఎం తరపున కలిపి 3 గురు, అలాగే 3 గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

​అదేవిధంగా జిల్లాలోని మొత్తం 371 ఎంపిటీసి స్థానాలకు గాను ఇప్పటికే 151 స్థానాలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయని సీఈఓ వెల్లడించారు. దరిసి, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ, కురిచేడు, పొన్నలూరు, మర్రిపూడి తదితర మండలాల్లోని పలు ఎంపిటీసి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవమైన 151 స్థానాల్లో టిడిపికి చెందినవారు 143 మంది, జనసేనకు చెందినవారు 5 గురు, వైఎస్ఆర్సిపికి చెందినవారు ఇద్దరు మరియు ఒక స్వతంత్ర అభ్యర్థి ఎన్నుకోబడ్డారు. ఇక మిగిలిన 220 ఎంపిటీసి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 599 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు 211 మంది, టిడిపి అభ్యర్థులు 210 మంది, జనసేన అభ్యర్థులు 25 మంది, సిపిఎం తరపున 6 గురు, కాంగ్రెస్ తరపున 5 గురు, బిఎస్పి తరపున ముగ్గురు, బిజెపి తరపున ఒకరు, సిపిఐ తరపున ఒకరు బరిలో నిలిచారు.

   ​ఎలక్షన్ ఏర్పాట్ల విషయానికొస్తే, జిల్లా వ్యాప్తంగా 1,265 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంప్‌లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. సుమారు 130 పోలింగ్ స్టేషన్లను సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించామని, పోలీసు అధికారులతో చర్చించి అవసరమైన చోట మైక్రో అబ్జర్వర్లను, వెబ్ కాస్టింగ్ లైవ్ రికార్డింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులోని మూడు ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్‌లలో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, మరో రెండ్రోజుల్లో పూర్తిచేసి భద్రపరుస్తామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని ఇప్పటికే అన్ని మండల హెడ్ క్వార్టర్లకు తరలించడం జరిగింది.

  ​సిబ్బంది రవాణా కోసం జిల్లాను 84 జోన్లు, 144 రూట్లుగా విభజించి ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సుల ద్వారా పోలింగ్ సిబ్బందిని నవంబర్ 4వ తేదీ సాయంత్రానికే వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరవేస్తామని వివరించారు. ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా పోలింగ్ శాతాన్ని, ప్రక్రియను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో FST, SST, MCC బృందాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు.

​ఈసారి కౌంటింగ్ కేంద్రాల వికేంద్రీకరణ కాకుండా కేవలం ఒంగోలులోని రైజ్ కాలేజీ (RISE College) మరియు Qis కాలేజీ లలోనే కౌంటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించినట్లు తెలిపారు. కొండేపి, కందుకూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని మండలాల కౌంటింగ్ రైజ్ కాలేజీలోను; దర్శి, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల పరిధిలోని మండలాల కౌంటింగ్ Qis కాలేజీలోను జరుగుతుంది. ప్రతి మండలానికి ఒక ఏఆర్‌ఓ (ARO) బాధ్యతలు వహిస్తారని, ఫలితాల ప్రకటన అనంతరం విజేతలకు ధృవీకరణ పత్రాలను కూడా అక్కడే అందజేస్తారని తెలిపారు.
​ఈ ఎన్నికల ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఓటర్లందరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని జిల్లా పరిషత్ సీఈఓ బి. చిరంజీవి గారు కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *