ఒంగోలు సమీపంలోని రైజ్ (RISE) కాలేజీ, క్విజ్ (QIS) కాలేజీలలో ఈ రోజు శనివారం జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, బారికేడింగ్, ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలు, కేంద్రాల పరిసరాల్లో భద్రతా చర్యలను సమీక్షించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్న తీరుపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ, అనుమతి లేని వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లోకి ప్రవేశించకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు.
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో క్విస్ కాలేజీలో 12 మండలాలకు, రైస్ కాలేజీలో 13 మండలాలకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ఇందుకోసం సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అదేవిధంగా, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. ఎన్నికల ముగిసిన అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు బాణసంచా కాల్చేందుకు అనుమతి లేదన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: