జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం సర్వం సిద్ధం చేసినట్లు జడ్పీ సీఈవో చిరంజీవి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 27 జడ్పిటిసిలకు గాను కనీసం 14 మంది హాజరైతే చేతులు ఎత్తే విధానం ద్వారా ఈ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారి అధ్యక్షతన ఈ మొత్తం ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా జడ్పిటిసి సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. కాగా, ప్రస్తుతానికి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక లేదని, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇద్దరు కోఆప్షన్ సభ్యుల కోసం ఎన్నిక నిర్వహిస్తామన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల కోసం గురువారం ఎన్నిక నిర్వహించామని సీఈవో చెప్పారు. కొత్తపట్నం మండలంలో కోరం లేని కారణంగా ఎన్నిక జరగలేదని, ఇక్కడ శుక్రవారం కోరం ఉంటే ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మిగిలిన అన్ని మండలాలలో ఈ ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. కాగా, మండల స్థాయిలో కూడా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: