పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం -నేడు తొలి దశ పోలింగ్ -కందుకూరు మున్సిపాలిటీకి కూడా…క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ -పటిష్ట బందోబస్తు, నిఘా పెట్టామన్న ఎస్పీ

జిల్లాలో గురువారం జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికలకు, కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలకు ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు , ఏ.ఎస్.పి. యుగంధర్, సబ్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలింగ్ ఇలా….

మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో 139 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఇందులో 62 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 782 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారని, మిగిలిన 610 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ సామాగ్రితో సిబ్బంది అందరూ బుధవారం సాయంత్రానికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు.
                కందుకూరు మున్సిపాలిటీకి సంబంధించి 40 వార్డులకుగాను 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో 47,400 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ , సబ్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
               పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతాయని, అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. కందుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఈనెల 30వ తేదీన స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మున్సిపాలిటీలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సిసి కెమెరాల ద్వారా ప్రత్యక్ష వీక్షణ ఉంటుందన్నారు. మిగతా కేంద్రాలలో వీడియో రికార్డింగ్ నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, సమస్యలు ఏమైనా ఉంటే 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లుగా ఉండే వారు ప్రత్యేకంగా పోలీస్ ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ గారు స్పష్టం చేశారు.

బందోబస్తు ఇలా….

 పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వివరించారు. మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 160 మంది సిబ్బందితో, పంచాయతీ ఎన్నికలకు దాదాపు 1180 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కందుకూరుకు సంబంధించి 9 అత్యంత సమస్యాత్మక, 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఇక్కడ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు కూడా అదనపు ఎస్పీ అధికారిని పర్యవేక్షణ కోసం పెట్టామన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం జిల్లాలో ఉన్న డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్స్ మరియు అందరినీ విధులకు కేటాయించామన్నారు. ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామన్నారు.
 
ఈ సమావేశంలో డి.ఎస్.పి. బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ అనూష, ఇతర అధికారులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *