హైదరాబాద్ నవంబర్ 25,(జే ఎస్ డీ ఎం న్యూస్ )
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పేద, మధ్యతరగతి మహిళల అక్రమ అండాల సేకరణ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, సభ్యురాలు ఉజ్మా షకీర్ బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను ఉద్యోగ, ఈవెంట్ అవకాశాల పేరుతోహైదరాబాద్కు రప్పించి, వారి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు కమిషన్ విచారణలో తేలిందని గవర్నర్‌కు వివరించారు.
ఈ నెట్వర్క్ వివిధ రాష్ట్రాలకు విస్తరించి ఉన్నందున ఉన్నత స్థాయి కమిటీతో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కమిషన్ కోరింది. అలాగే, ఏఆర్టీ (ART) చట్టంలోని లోపాలను సవరించి మహిళల ఆరోగ్యం, భద్రతకు రక్షణ కల్పించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్, సంబంధిత శాఖల అధికారులతో పాటు ప్రభుత్వంతో సంప్రదించి తగిన చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తానని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నేరెళ్ల శారద పేర్కొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: