బేగంపేట నవంబర్ 25,(జే ఎస్ డీ ఎం న్యూస్ )
విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ)లో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో పాఠశాలల్లో ట్రాఫిక్ క్లబ్‌ల ఏర్పాటుపై ఈ శిక్షణ జరిగింది. ఇందులో బోల్టన్ ఉన్నత పాఠశాల, అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్, బోయిన్‌పల్లి మరియు తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూళ్లు, ఆల్వాల్‌లోని సెయింట్ మైఖేల్స్, సెయింట్ పయస్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు, ఇన్‌స్పెక్టర్లు
కావేటి శ్రీనివాసులు, వి. సర్దార్ నాయక్, అదనపు ఇన్‌స్పెక్టర్ జి. జానకి రాములు తదితరులు విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ఆవశ్యకత, పాదచారుల భద్రతపై వివరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ శిక్షణలో ట్రాఫిక్ పోలీసులు విధుల్లో వినియోగించే బ్రీత్ అనలైజర్లు, లాఠీ లైట్లు, వైర్‌లెస్ మ్యాన్‌ప్యాక్‌లు, ట్రాఫిక్ కోన్ల పనితీరును విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా మారి రహదారి భద్రతకు ప్రతినిధులుగా నిలవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: