దొంగతనాలను అరికట్టటంలో వ్యాపారులు తమ వంతు సహకారం అందించాలని దర్శి సీఐ జె రామకోటయ్య కోరారు. తూర్పు గంగవరంలో గురువారం మండలంలోని పలు గ్రామాల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వ్యాపారాల సముదాయాలలో, రద్దీ ప్రాంతాలలో, పెట్రోలు బంకుల వద్ద, దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణకు తమ వంతు సహకారం అందించాలని, రోడ్లపై వినియోగదారులు వాహనాలు నిలపకుండా ముందస్తు సూచనలు ఇవ్వాలని చెప్పారు. ప్రమాదాల నివారణకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆర్ధిక పరమైన మోసాలు అధికంగా జరుగుతున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుని ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాలని సూచించారు. ఎస్సై ప్రేమకుమార్, ఎఎస్సై మోహనరావు పాల్గొన్నారు.


