ప్రజా సమస్యలపై తక్షణ స్పందనతో అధికారులకు ప్రజలలో మంచి గుర్తింపు వస్తుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం అత్యవసర సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఎటువంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా క్లుప్తంగా సమావేశంను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంపీడీఓ కెవై కీర్తి తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ…. ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమ కార్యాలయాలకు వస్తున్న పని సక్రమంగా అవుతుందో లేదో గమనించి వారికి సరియైన సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేస్తే మంచి మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ గత సమావేశాలలో ప్రజా ప్రతినిధులు అడిగిన సమస్యలపై వివరణ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రధాన వీధిలో విద్యుత్ స్తంభాలు, తాగు నీటిలో బోరు నీరు కలుస్తున్న విషయాలను, నివాసాలు నిర్మించుకుని నేటికి జియో ట్యాగ్ చేయని వారి విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వైస్ ఎంపీపీ-2 మంచాల ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ పంచాయితీలలో సభ్యులు సభ దృష్టికి తీసుకు వచ్చిన విషయాలను పరిష్కరించటంలో అధికారులు దృష్టి సారించాలని కోరారు. మల్కాపురం సర్పంచి ‘విద్యుత్ బిల్లుల వసూలు సమయంలో అధికారులు తీరు సక్రమంగా లేదని, పాఠశాల వద్ద ట్రాన్సఫార్మరు మార్చాలని కోరారు.
తాళ్లూరు-2 ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్ మాట్లాడుతూ పలు స్థంబాలు తుప్ప పట్టి పాడయి పోయి ఉన్నాయని వాటిని తొలగించాలని కోరారు. బొద్దికూరపాడు సర్పంచి మందా శ్యామ్సన్ ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభాలు, లైన్లు మార్చాలని విద్యుత్ అధికారులు సహకరించాలని కోరారు. మన్నేపల్లి సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పాఠశాల వద్ద మరో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. నాగంబోట్లవారిపాలెం సర్పంచ్ సుబ్బారావు, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాసరెడ్డిలు రేషన్ షాప్ లో మొబైల్ వాహనం దారుని మార్పు గురించి చర్యలు తీసుకోకపోవడం పై రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. రామబద్రాపురం సర్పంచ్ బాపిరెడ్డి వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ… గ్రామంలో ట్యాంకులకు మంచినీరు సక్రమంగా రావటం లేదని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎంఈఓ సుబ్బయ్య,పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఎఈ వీరబ్రహ్మం,వైద్యాధికారి ఖాదర్ మస్తాన్, వైద్యురాలు మౌనిక, ఈఓఆర్డీ ప్రసన్నకుమార్, ఎపీఓ మురళి తదితరులుపాల్గొన్నారు.









