నీళ్ల సాంబార్, నాణ్యత లేని నీళ్ల మజ్జిగ, అందులోకి గంజితో కలిపిన చెట్నీ. హాస్టల్లో భోజనం తినలేక పోతున్నామని చీమకుర్తి గరికమిట్టలోని ఏపీ గిరిజన గురుకుల పాఠశాల బాలురు జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గురుకుల పాఠశాలను బూచేపల్లి వెంకాయమ్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం చేసే సమయానికి హాస్టల్లో వార్డెన్ శ్రీనివాసరావు అందుబాటులో లేడు. వార్డెన్ ఎక్కడకి వెళ్లాడని సిబ్బందిని అడిగితే వారానికి ఒకటి రెండు సార్లు వస్తారని సమాధానం చెప్పటంతో జెడ్పీ చైర్ పర్సన్ వెంకాయమ్మ వార్డెన్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో
మూడుసార్లు వచ్చినప్పుడూ భోజనం నాణ్యత సక్రమంగా లేకపోవడంతో అప్పట్లో హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో వార్డెన్ పనితీరుపై వెంకాయమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెనూ అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు భోజన పెడుతున్నారని ఆగ్రహించారు. సైన్స్ టీచర్ లేకపోవడంతో సైన్స్ పాఠాలు చదువుకోవడం కష్టంగా ఉందని తెలిపారు. వార్డెన్ నిర్లక్ష్యం, భోజనం నాణ్యత లేకపోవడంపై కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఫుడ్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ ద్వారా బూచేపల్లి వెంకా యమ్మ ఫిర్యాదు చేశారు. వెంటనే కలెక్టర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వర లక్ష్మిని గురుకుల పాఠశాల సందర్శనకు పంపించారు. హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని వెంకాయమ్మ కలెక్టర్ కి సిఫార్సు చేశారు. అనంతరం విద్యా ర్థులకు వెంకాయమ్మ చేతుల మీదుగా భోజనం వడ్డించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత జిల్లా నుంచి గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి వార్డెన్ శ్రీనివాసరా వుతో కలిసి వచ్చారు. భోజనం నాణ్యత సక్రమంగా లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. హాస్టల్ నిర్వహణను కూడా గురుకుల పాఠశాల ప్రిన్సిపాలు అప్ప గించాలని తెలిపారు.






