ప్రాధాన్యత రంగాలకు రుణాలు లక్ష్యాల మేరకు అందించాలి –

ప్రాధాన్యత రంగాలకు రుణాలు లక్ష్యాల మేరకు అందించాలని , కౌలు రైతులకు పంట రుణాలను అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ,
ఎంఎస్ఎంఈలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని , పిఎం సూర్య ఘర్ యోజన మూఫ్తి బిజిలి యోజన రుణాలు వేగవంతం చేయాలని డ్వాక్రా సంఘాలకు, యువతకు స్వయం ఉపాధి రుణాల మంజూరుతో పాటు యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఆదేశించారు .
జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు మంజూరు చేయాలనీ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, బ్యాంకర్లను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తిగా ఖచ్చితంగా సాధించాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని, అందుకనుగుణంగా యూనిట్స్ స్థాపనపై బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా మరింతగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం వున్న నేపధ్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలు నగరంలో ప్రకాశం బిజినెస్ అలైట్ మీట్ నిర్వహించి హాజరైన పారిశ్రామిక వేత్తలకు జిల్లాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సమగ్రంగా వివరించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా బ్యాంకర్లు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్స్ ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పిఎంఈజిపి, ముద్ర, పీఎం విశ్వకర్మ, తదితర కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులకు పంట రుణాలను అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పియం సూర్య ఘర్ పధకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు.
2025-26 ఆర్దిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు 16 వేల 381 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా, 18,499.56 కోట్ల రూపాయలు రుణాలుగా అందచేసి 112.93 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలోని 9 వేల 809 స్వయం సహాయక సంఘాలకు 1261.97 కోట్ల రూపాయలు రుణాలు లక్ష్యంగా కాగా 11,220 స్వయం సహాయక సంఘాలకు 1461.99 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసి 115.85 శాతం మేర లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్లో 4060.07 కోట్ల రూపాయలు రుణాలు లక్ష్యంగా కాగా, 3685.95 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసి 90.79 శాతం మేర లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. డ్వాక్రా సంఘాలకు, యువత స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేయడంతోపాటు యూనిట్ల ఏర్పాట్లలో కూడా వారికి సాంకేతిక సహాయం అందించి త్వరిగతిన యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందుకు సంబంధించి అర్హత పొందిన లబ్దిదారులకు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా రూడ్ సెట్ ద్వారా అమలు జరుగుచున్న శిక్షణా కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, నాబార్డు అధికారి రవికుమార్, ఆర్బిఐ ఎజిఎం కిషన్ కుమార్, డిఆర్డిఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ, విజయలక్ష్మి, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావు, సిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, జిల్లా సెరికల్చర్ అధికారి డా. సుజయ్, రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *