పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు తో రైతులకు అధిక లాభం చేకూరుతుందని మండల వ్యవసాయ అధికారి బి. ప్రసాదరావు అన్నారు. తాళ్లూరులోని రైతు భరోసా కేంద్రం లో గురువారం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ …వ్యవసాయ రంగంలో వస్తున్న సమూల మార్పులకు అనుగుణంగా రైతులకు ఒకే చోట అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 14 వ విడత పి.ఎం కిసాన్ నిధులు గురువారం విడుదల అయ్యాయని తెలిపారు. తాళ్లూరు మండలంలో 8509 మంది రైతులకు రూ.2000 రూపాయల వంతున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కేవైసీ చేయించుకోని వారు త్వరగా దానిని పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కోరమండల్ సంస్థ అధికారి ఆక్సిన్ రెడ్డి, ఏఈఓ నాగరాజు, గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

