ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బి.ఎల్.ఏ. లు కూడా భాగస్వాములు అయ్యేలా రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం నిర్వహిస్తున్న సమావేశంలో భాగంగా బుధవారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా కలెక్టర్ వారికి వివరించారు. బి.ఎల్.ఓ.లు ఈ సర్వే నిర్వహిస్తున్నప్పుడు కొన్ని చోట్ల వారి వెంట బి.ఎల్.ఏ.లు ఉండడం లేదని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాను ఎలాంటి లోపాలు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో బి.ఎల్.ఏ.లు కూడా భాగస్వాములయ్యేలా చూడాలని రాజకీయ పార్టీలకు సూచించారు. కాగా కొన్ని చోట్ల డోర్ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాలేదని రాజకీయ పార్టీల ప్రతినిధులు చెప్పగా, దీనిని వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ స్వంత ఇల్లు ఉండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు రెండు చోట్లా ఓటర్లుగా ఉంటున్నారని, అద్దె ఇళ్లను ఖాళీ చేసిన వారికీ, వారి స్థానంలో ఆ ఇంటిలోకి కొత్తగా వచ్చిన వారికీ అదే డోర్ నెంబరుతో ఓట్లు ఉంటున్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు చెప్పగా, ఇలాంటి కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ.ఆర్.ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో డి.ఆర్.ఓ. శ్రీమతి ఆర్.శ్రీలత, ట్రైనీ కలెక్టర్ శౌర్య పటేల్, ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, ఈ.ఆర్.ఓ.లు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి క్రాంతి కుమార్, కాంగ్రెస్ నుంచి రసూల్, బి.జె.పి. నుంచి రాజశేఖర్, సి.పి.ఐ. నుంచి చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

