చంద్రబాబు కు రిమాండ్ -ఉత్కంఠ అనంతరం ఎసిబి కోర్టు తీర్పు-రాజమహేంద్రవరం-సెంట్రల్ జైలుకు తరలింపు -నేడు రాష్ట్ర బంద్ కు-టిడిపి పిలుపు

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాము కేసులో ఎసిబి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆరు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు న్యాయమూర్తి హిమబిందు తీర్పు వెలువరించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. నంద్యాలలో శనివారం తెల్లవారుజామున చంద్రబాబును అరెస్టు చేస్తారని అర్ధరాత్రి సమయంలో వార్తలు వచ్చినప్పటి నుంచి మొదలైన ఉత్కంఠ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు వీడింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రికి పటిష్ట భద్రత మధ్య చంద్రబాబును తరలించారు. రిమాండు వార్త తెలిసిన వెంటనే సోమవారం నాడు రాష్ట్ర బంద్ నిర్వహించాలని టిడిపి పిలుపునిచ్చింది. దీనికి జనసేన మద్దతు ప్రకటించింది. సిపిఐ సంఘీభావం తెలిపింది. శనివారంనాడు మొదలైన టిడిపి శ్రేణుల నిరసనలు ఆదివారం రాత్రి కూడా కొనసాగాయి. కోర్టు తీర్పు వెలువడ్డాక ఎకడికక్కడ రాస్తారోకోలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దగ్ధం వంటివి జరిగాయి. మరోవైపు వైసిపి కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు వార్తలు వచ్చినా డిజిపి కార్యాలయం తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా అధికారులు ఎక్కడికక్కడ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. తీర్పు నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *