ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా స్థాయి ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు. ఈ క్రమంలోనే మండల స్థాయిలో “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక సౌజన్య ఫంక్షన్ హాలులో నిర్వహించిన మార్కాపురం మండల స్థాయి “జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 154 అర్జీలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. దీనిని మరింతగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అర్జీలను సహేతుకంగా, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చెప్పారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా పిటిషన్లను పరిష్కరించాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఎం.ఎల్.ఏ. కె. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ… “జగనన్న సురక్ష” కార్యక్రమంలో ప్రజల వద్దకే వెళ్లి వారికి అవసరమైన సర్టిఫికెట్లను, సంక్షేమ పధకాల ప్రయోజనాన్ని అందించినట్లుగానే తాజాగా మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలకు క్షేత్రస్థాయిలోనే ప్రభుత్వ సేవలను అందించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నారదముని, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.





