తాళ్లూరు మండలంలోని రామభద్రా పురం గ్రామ సమీపంలో ఆవుల షెడ్లో బీహార్ కు చెందిన యువకుడు రాజన్ పాశ్వాన్(21) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన సారెడ్డి వెంకటరెడ్డి ఆవుల షెడ్లో రాజన్ పాశ్వాన్ గత కొంత కాలంగా కూలీపని చేస్తున్నాడు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రాజన్ పాశ్వాన్ వద్దకు వచ్చాడు. వెంకటరెడ్డి అతను ఎవరు అని రాజన్ పాశ్వాన్ ప్రశ్నించగా తన స్నేహితుడు అని సమాధానం చెప్పాడు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయాన్నే వెంకటరెడ్డి షెడ్ వద్దకు వచ్చి చూడగా రాజన్ పాశ్వాన్ బయట కనిపించ లేదు. షెడ్ లోపలికి వెళ్లి చూడగా మంచంపై విగత జీవిగా పడిఉన్నాడు. ముఖంపై గాయాలు కనిపిం చడంతో వెంటనే స్థానిక పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమ్ కుమార్ పరిశీలించి హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. దర్శి డీఎస్పీ అశోకవర్థన్ రెడ్డి పర్యవేక్షణలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి రామలాన్ పాశ్వాన్, అన్న లాలన్ పాశ్వాన్ శివరామపురంలో ఆవుల షెడ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి అన్న లాలన్ పాశ్వాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకోటయ్య తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

