అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా స్పందన పిటిషన్లను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో జవాబుదారీతనం పెంచడానికే మండల స్థాయిలో “జగనన్నకు చెబుదాం” (స్పందన) కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం పొదిలి మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం స్థానిక సాయి బాలాజీ కళ్యాణ మండపంలో జరిగింది. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ శౌర్య మన్ పటేల్, ఆర్.డి.ఓ. అజయ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 154 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ… స్పందన అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని చెప్పారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ఆయన పునరుద్ఘాటించారు. అర్జీలను సకాలంలో పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. కింది స్థాయి అధికారులు అర్జీలను పరిష్కరిస్తున్న తీరును ఆయా శాఖలలోని స్పందన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమాలను నిర్వహించామని, స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా మండల స్థాయి స్పందన కార్యక్రమాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలోనూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి బుధ మరియు శుక్రవారాలలో జిల్లా స్థాయి అధికారులందరూ క్షేత్రస్థాయికి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్ల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పిటిషన్ల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మండల స్పెషల్ అఫీసర్ గా ఉన్న చేనేత జౌళీ శాఖ సహాయ సంచాలకులు బి.ఉదయ్ కుమార్, తహశీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, ఎం.పి.డి.ఓ. శ్రీకృష్ణ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



