స్పందనలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో “డయల్ యువర్ కలెక్టర్”, “స్పందన” కార్యక్రమాలలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..ఈ రోజు స్పందన కార్యక్రమంలో 332 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని ఆయన చెప్పారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ముందుగా డయల్ యువర్ కలెక్టర్ …కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజలు ఫోన్లో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. వీటిపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
- కంభం మండలం తురిమెళ్ల గ్రామం నుంచి కె. రామ్ ప్రసాద్ ఫోన్ చేశారు. తమ గ్రామంలోని చెరువు నిండి, పక్కనే ఉన్న 60 ఎకరాల పంట పొలాలు మునిగి పోతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- కనిగిరి మండలం, పునుగోడు గ్రామం నుంచి ఎం.సుబ్బారెడ్డి ఫోన్ చేశారు. 272 సర్వే నెంబర్ లో పొజిషన్లో ఎవరున్నారో వివరాలు ఇప్పించవలసినదిగా కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని పరిశీలించి పరిష్కరించాలని కనిగిరి మండల తహసీల్దార్ ను ఆయన ఆదేశించారు.
- కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామం నుంచి వై. రమణారెడ్డి ఫోన్ చేశారు. తమ గ్రామంలో గేదెలకు అనారోగ్యం కలిగినా సచివాలయంలోని వెటర్నరీ అసిస్టెంట్
స్పందించడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయంపై సమగ్ర విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
- కనిగిరి మండలం, తుమ్మగుంట గ్రామం నుంచి వి.శివక్రృష్ణ ఫోన్ చేశారు. సర్వే నెంబర్. 2473లోని తమ భూమి వేరే పేరు మీద ఆన్లైన్ ఎక్కించారని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ, ఈకేసును పరిశీలించాలని కనిగిరి మండల తహశీల్దారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. కె. శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమాదేవి, లోకేశ్వరరావు, వరకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
గిరిజనులను రీలొకేట్ చేయడంలో వారికి అవసరమైన జీవనోపాధి చూపి, స్థిర నివాసం కల్పించాలి – జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పులుల సంఖ్యతోపాటు అడవులలో అవి సంచరిస్తున్న ప్రాంతం కూడా పెరుగుతున్నందున ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టరెట్లో ఆయన సమీక్షించారు. గిరిజనులను రీలొకేట్ చేయడంలో వారికి అవసరమైన జీవనోపాధి చూపి, స్థిర నివాసం కల్పించాలన్నారు. ఈ విధంగా మధ్యప్రదేశ్లోని సాత్పూరా ప్రాంతంలో అనుసరించిన విధానాలను ఇక్కడ కూడా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు ఇచ్చిన స్థలాలకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలని కలెక్టర్ చెప్పారు. అటవీ, రెవెన్యూ అధికారులు మరోసారి సంయుక్తంగా సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్ట్ భూములలో పట్టాలు మంజూరు చేసినట్లు గుర్తిస్తే వాటిని రద్దు చేసి గిరిజనులకు రెవెన్యూ భూములను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ (ఫారెస్ట్) జి. విఘ్నేష్ అప్పావు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, ఏ.ఎస్.పి. నాగేశ్వరరావు, డి.ఆర్.ఓ. శ్రీమతి. ఆర్. శ్రీలత, డి.ఎఫ్.ఓ. పి.సునీత, డిప్యూటీ డైరెక్టర్ (పి.టి. గిద్దలూరు) వై. నరసింహులు, జిల్లా – గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.